మెసేజ్ ఇచ్చే మాస్ సాంగ్.. రై రై రా రా: అనంత్ శ్రీరామ్
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రంలోని ‘రై రై రా రా’ సాంగ్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సందర్భంగా గీత రచయిత అనంత శ్రీరామ్ ఈ పాట గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘సాధారణంగా మాస్ పాటల్లో సంగీతం, డ్యాన్స్‌కే ప్రాధాన్యత ఉంటుంది, కానీ ఇందులోని సాహిత్యానికి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక్క రాత్రిలో రాసిన పాట కాదు.. దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి నెలల తరబడి చర్చించి, అనేక వెర్షన్లు మార్చిన తర్వాతే ఫైనల్ చేశాం.
ఈ తరానికి, ముందు తరానికి కూడా గొప్ప మెసేజ్ ఇస్తూనే, మాస్‌ని అలరించేలా ఉంటుంది. యూత్‌కి ఒక యాంథమ్ లాగా ఉండాలి అని డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన మాట నాకు తారకమంత్రంలా పనిచేసింది. శ్రీశ్రీ గారి గేయ కవితా శైలిలో, అచ్చ తెలుగు పదాలతో, లోతైన అర్థం వచ్చేలా కూర్చాను. ఇందులోని ‘పాతికేళ్లకే పాతబడిపోకురా’ అనే లైన్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది. ‘రై రై’ అనే పదం ఆర్టీసీ కండక్టర్ ఇచ్చే విజిల్ శబ్దం నుండి స్ఫూర్తి పొందాను.
జీవితం అనే బస్సును ముందుకు నడిపించాలనే అంతరార్థంతో దీన్ని వాడాను. షూటింగ్ లోకేషన్‌లో పాట వినగానే చరణ్ తనను హత్తుకోవడం మర్చిపోలేను. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన ఐరన్ మ్యాన్ రామ్ చరణ్. ఈ చిత్రంలో మరో మూడు పాటలు రాశాను. స్పిరిట్, చెన్నై లవ్ స్టోరీతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌లు జరుగుతున్నాయి. ఇరవై ఏళ్ల పాటు నిలకడగా రాణించడమే నా అసలైన విజయంగా భావిస్తున్నాను’ అని చెప్పారు.