వైకాపా హయాంలోని తప్పులను సరిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు
నంద్యాల: వైకాపా హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. రికార్డులు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్నామన్నారు. నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. కొత్తబురుజు గ్రామసభలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టా ఇప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదన్నారు. సమస్యలన్నీ పరిష్కరించాకే కొత్త పాసుపుస్తకాలు ఇస్తున్నామని, భవిష్యత్‌లోనూ ఎక్కడా తప్పులు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
‘‘ గత ప్రభుత్వ హయాంలో మద్యాన్ని కల్తీ చేసి వేల మందిని పొట్టన పెట్టుకున్నారు. పేదవాడి ఆరోగ్యం కంటే వాళ్లకు డబ్బులే ముఖ్యమా? తిరుమల ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూశారు. వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించను. ఇతర మతాల సంప్రదాయాలను కాపాడతాం. కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు. ప్రజల జీవితాలు, ఆరోగ్యంతో ఆడుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అంతా కల్తీ.. కుంభకోణాలే. ముఠాలు వద్దు.. గ్రామాల ప్రశాంతతే ముద్దు అని అందర్నీ కలిపా. రౌడీయిజం, ముఠా కక్షలు లేకుండా చేశాం. రాయలసీమను రతనాల సీమగా మారుస్తా. ఉద్యానవనంగా చేసి చూపిస్తాం. ఇక్కడి ఉత్పత్తులకు ప్రపంచస్థాయిలో మార్కెట్ కల్పిస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.