ఐపీఎల్ 2026పై బిగ్ అప్‌డేట్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఎడిషన్‌పై బిగ్ అప్‌డేట్ వచ్చింది. మార్చి 12న లీగ్ తొలి 20 రోజుల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు.
దేశంలో పలు రాష్ట్రాల్లో (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం) ఎన్నికల నేపథ్యంలో పూర్తి షెడ్యూల్ ప్రకటించడంలో ఆలస్యం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మిగతా షెడ్యూల్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా, ఐపీఎల్ 2026 ఎడిషన్ తొలుత మార్చి 26న ప్రారంభమవుతుందని ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల రెండు రోజులు వాయిదా పడింది. ఈ ఎడిషన్ మార్చి 28న ప్రారంభమై, మే 31న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.
ఓపెనింగ్ మ్యాచ్‌లో ఎవరెవరు..?
సాంప్రదాయం ప్రకారం గత సీజన్ విజేతలు, రన్నరప్ జట్లు సీజన్ తొలి మ్యాచ్ ఆడతాయి. ఈ లెక్కన ఆర్సీబీ (విజేతలు), పంజాబ్ కింగ్స్ (రన్నరప్) మధ్య తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు.
అయితే ఇటీవల స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన పోస్టర్‌లో ఐపీఎల్ ట్రోఫీ చుట్టూ పసుపు, గులాబీ రంగు రిబ్బన్లు ఉండటంతో సీఎస్‌కే, రాజస్థాన్ రాయల్స్ మధ్య తొలి మ్యాచ్ జరుగుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే విజేతలు, రన్నరప్ అనే సాంప్రదాయానికి బ్రేక్ పడినట్లే. దీనిపై స్పష్టత రావాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.