"ప్రేమ నేరం కాదు".. : రవాణా మంత్రికి భార్య షాక్.. త్వరలోనే రాజీనామా చేసే ఛాన్స్..
కేరళ రాజకీయాల్లో ఇప్పుడు రవాణా మంత్రి కె.బి. గణేష్ కుమార్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. ఆయన భార్య చేసిన ఆరోపణల వల్ల ఆయన మంత్రి పదవిని కోల్పోయే అవకాశం కనిపిస్తోంది.
కేరళ మంత్రి గణేష్ కుమార్ భార్య బింధు మీనన్, ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను మోసం చేస్తున్నారని, మరొక మహిళతో ఆయన సన్నిహితంగా ఉండటం తాను స్వయంగా చూశానని, ఈ విషయంపై ముఖ్యమంత్రి కుమార్తెకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు.
కేరళలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఈ వివాదం ప్రభుత్వంపై పడకుండా ఉండేందుకు, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయన్ని రాజీనామా చేయమని కోరే అవకాశం ఉంది.
రవాణా మంత్రికి భార్య ప్రకారం.... మా మధ్య 2023 నుండి సమస్యలు పెరిగాయి. ఆయన తీరు సరిగ్గా లేదు. నేను ఫోటోలు తీస్తుంటే ఆయన సిబ్బంది నా ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. నాకు ఎవరినీ ఇబ్బంది పెట్టాలని లేదు, కానీ నాకు జరిగిన అన్యాయాన్ని చెబుతున్నాను అని బింధు మీనన్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు.. ప్రేమించడం నేరం కాదు. నా వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. నేను ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు అని మంత్రి గణేష్ కుమార్ సమర్థించుకుంటున్నారు.
విచిత్రం ఏమిటంటే, 2013లో కూడా అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన మొదటి భార్య కూడా ఇలాంటి ఆరోపణలే చేయడంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అవుతోంది. మంత్రి భార్యకే న్యాయం జరగకపోతే, ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి ? అని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.