స్పీకర్ తీర్పుపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్‌చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే అంటూ ఘాటు విమర్శలు చేశారు.
తెలంగాణ స్పీకర గడ్డం ప్రసాద్ తీర్పుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్‌చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే అవుతుంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు.
ఇది కేవలం ఒక తీర్పు మాత్రమే కాదు.. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ. ప్రజల ఓట్లతో గెలిచి.. పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి?. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన సమయంలో సమాధానం చెబుతారు అంటూ పోస్టు చేశారు.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం.