సన్‌రైజర్స్‌తో ఆర్సీబీ తొలి పోరు.. ఐపీఎల్ 19వ సీజన్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ రిలీజ్
ముంబై: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ నగారా మోగింది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్‌ను బీసీసీఐ బుధవారం రిలీజ్ చేసింది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు–సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఈ నెల 28న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే తొలి పోరుతో కొత్త సీజన్ మొదలవనుంది.
మూడు రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతానికి ఏప్రిల్12 వరకు జరగబోయే తొలి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ వెల్లడించింది. తొలి దశలో మొత్తం 10 నగరాల్లో (బెంగళూరు, ముంబై, గువాహటి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్) ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ 15 రోజుల వ్యవధిలో మొత్తం 4 రోజులు రెండేసి మ్యాచ్‌లను(డబుల్ హెడర్స్) షెడ్యూల్ చేసింది.
మధ్యాహ్నం మ్యాచ్‌లు ఎప్పట్లానే మూడున్నరకు, రాత్రి మ్యాచ్‌లు ఏడున్నరకు షురూ అవుతాయి. ఫస్ట్ ఫేజ్‌లో హైదరాబాద్‌కు ఒక్కటే మ్యాచ్ దక్కింది. ఏప్రిల్ 5న ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో (మ. 3.30) సన్ రైజర్స్ తలపడనుంది. ఇక, ఆర్సీబీ తమ ఏడు హోమ్ మ్యాచ్‌ల్లో ఐదు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో, మరో మూడు రాయ్‌పూర్‌లో ఆడనుంది.
రాజస్తాన్ రాయల్స్ తమ హోమ్ మ్యాచ్‌ల్లో మూడు గువాహటిలో, నాలుగు జైపూర్‌లో ఆడుతుందని బీసీసీఐ వెల్లడించింది. అలాగే పంజాబ్ కింగ్స్ 4 హోమ్ మ్యాచ్‌లను న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో, మరో మూడింటిని ధర్మశాల స్టేడియంలో ఆడుతుందని తెలిపింది.