చమురు మంటల్లో రష్యాపై సిరుల వాన.. రోజుకు రూ.3,700 కోట్ల ఆదాయం
ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు ఛాయలు కనిపించడం లేదు. ఈ సంక్షోభంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి (Oil Prices). దీంతో రష్యా చమురుపై విధించిన మరికొన్ని ఆంక్షలను అమెరికా ప్రభుత్వం సడలించింది. ఇప్పటికే నౌకల్లో లోడ్ అయిన చమురు కొనుగోలుకు అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటన చేసింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో స్థిరత్వాన్ని తీసుకువచ్చేందుకే ఈ తాత్కాలిక చర్యలు అని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ వెల్లడించారు.
‘‘ఇప్పటికే రవాణాకు సిద్ధమైన చమురుకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఇది రష్యా (Russia)కు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాన్ని ఇవ్వదు’’ అని వెల్లడించారు. ఇటీవల భారతీయ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి తాత్కాలికంగా 30 రోజులు మినహాయింపు ఇస్తున్నట్లు బెసెంట్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై రష్యా నుంచి స్పందన వచ్చింది. ప్రపంచ ఇంధన మార్కెట్లకు రష్యా చమురు ఎంత కీలకమో తాజా ప్రకటన వెల్లడి చేస్తోందని పేర్కొంది. తమ చమురు లేకుండా అంతర్జాతీయ మార్కెట్లు స్థిరంగా ఉండలేవని వ్యాఖ్యానించింది.
ఇప్పటికే లోడ్ అయిన చమురు రవాణాకు అమెరికా (USA) ఆంక్షలు సడలించడంతో.. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో రష్యాకు చెందిన 30 ట్యాంకర్లలోని చమురు కొనుగోలు కోసం అందుబాటులో ఉంది. ఈ నౌకల్లో 19 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, 3,10,000 టన్నుల రిఫైన్డ్ ఉత్పత్తులు ఉన్నాయి.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరగడం రష్యాకు అనుకూలిస్తోందని, యుద్ధంలో రష్యానే విజేత అని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మాటే నిజమవుతోంది. భగ్గుమంటోన్న ధరల కారణంగా పుతిన్ ప్రభుత్వానికి బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి (Russian oil).