అదను చూసి.. డ్రగ్స్ గుట్టు విప్పి.. ఈగల్ కీలక ఆపరేషన్
ఈనాడు, హైదరాబాద్: పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో మద్యం, డ్రగ్స్ పార్టీ కేసును తెలంగాణ ఈగల్ వ్యూహాత్మకంగా ఛేదించింది. ఇక్కడ వారాంతాల్లో తరచూ పార్టీలు జరుగుతున్నాయని, కొన్నిసార్లు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఈగల్‌కు ఉప్పందింది. దీంతోపాటు ఆర్థిక, భూ లావాదేవీలపై మాట్లాడేందుకు వేర్వేరు వ్యక్తులతో సమావేశాలు నిర్వహించడం, కొత్త వ్యక్తులు వస్తున్నట్లు ఈగల్ అధికారుల నిఘాలో బయటపడింది. ఈ వ్యవహారాన్ని కొన్ని నెలలుగా గమనిస్తున్న ఈగల్ బృందాలు అదను కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందింది. అంతకుముందే కొందరు దాదాపు 3 గ్రాముల కొకైన్ కొన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కొకైన్ ఎవరు డెలివరీ తీసుకున్నారు..? ఏ మార్గంలో ఎవరెవరికి చేరిందనే విషయాలపై నిఘా పెట్టింది. సోదాలకు మొయినాబాద్ పోలీసులు, చేవెళ్ల ఎస్‌వోటీ విభాగాల సాయం తీసుకున్నా.. వారికి 10 నిమిషాల ముందు వరకూ సోదాల విషయాన్ని చెప్పలేదు. వాస్తవానికి సోదాలకు వెళ్లిన కొద్ది నిమిషాల ముందే పార్టీలో పాల్గొన్న కొందరు కొకైన్ తీసుకున్నారు. ఈ పార్టీలో ఎంపీ పుట్టా మహేశ్ ఉన్న విషయం అక్కడికెళ్లాకే గుర్తించారు.