ఓరి దేవుడా.. ఏంటీ ఈ రేట్లు : లీటర్ పెట్రోల్ రూ.188, లీటర్ డీజిల్ రూ.196, గ్యాస్ బండ 2 వేల 126
ఇరాన్ యుద్ధం ఏమోకానీ.. ప్రపంచం మొత్తం ఇంధన సంక్షోభం.. ప్రతి దేశం ఎఫెక్ట్ అవుతుంది. మన దేశంలో ప్రస్తుతానికి ఆయిల్ రేట్లు స్థిరంగా ఉన్నా.. భారతదేశం పక్కనే ఉన్న దేశాలు మాత్రం ఆయిల్ రేట్లను భారీగా పెంచేశాయి. నిన్నా మొన్నటి వరకు మన దేశం రేట్లతో సమానంగా ఉండగా.. ఇప్పుడు మాత్రం అక్కడి జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. నేపాల్ దేశం రాత్రికి రాత్రి ఆయిల్ రేట్లు పెంచేసింది.. పెంచిన రేట్లు 2026, మార్చి 16వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయంటూ ప్రకటించి జనానికి చుక్కలు చూపించింది. ఇంతకీ నేపాల్ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఎంతకు చేరుకున్నాయో తెలుసుకుందామా...
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య చెలరేగిన తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. దీని ప్రభావం పొరుగు దేశమైన నేపాల్‌పై తీవ్రంగా పడింది. సరఫరాలో ఇబ్బందులు.. అంతర్జాతీయ రేట్లు పెరగడంతో నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ ఆదివారం అర్ధరాత్రి జరిగిన అత్యవసర సమావేశంలో ఇంధన ధరలను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఫిబ్రవరి 28న ఇరాన్‌పై జరిగిన సైనిక దాడులు. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడంతో పశ్చిమాసియాలో పరిస్థితి చేయి దాటిపోయింది. ప్రతికారంగా ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై దాడులకు దిగింది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' గుండా నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడింది. ఈ పరిణామాలు గ్లోబల్ ఎకానమీని కుదిపేస్తున్నాయి.
నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించిన కొత్త ధరలు మార్చి 16 అర్ధరాత్రి నుండి అమలులోకి వచ్చాయి. ఈ సవరణ ప్రకారం లీటర్ పెట్రోల్‌పై ఏకంగా రూ. 31, డీజిల్‌పై రూ. 54 పెరిగాయి. అలాగే సామాన్యుడు వాడే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.296 భారం పడింది. దీంతో ఇప్పుడు నేపాల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.188కి, డీజిల్ రూ.196కి చేరింది. ఇక గ్యాస్ సిలిండర్ ధర రూ.2,126కు చేరుకోవడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ ఒత్తిళ్ల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా ఉండాలంటే ఈ పెంపు తప్పలేదని అధికారులు పేర్కొన్నారు.