హర్మూజ్ వద్దకు రండి: ట్రంప్ పిలుపు.. రాలేమన్న మిత్రులు
ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో హర్మూజ్ వద్ద ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలు వెళ్లకుండా దానిని మూసివేశామని ఇరాన్ చెబుతోంది. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపును మిత్ర దేశాలు తిరస్కరిస్తున్నాయి. ఇరాన్ యుద్ధం (Iran War) కారణంగా దెబ్బతిన్న హర్మూజ్‌ను సురక్షితంగా ఉంచేందుకు, అక్కడ ఇంధన రవాణాను క్రమబద్ధీకరించేందుకు యుద్ధ నౌకలను మోహరించాలని ట్రంప్ ఏడు దేశాలను కోరారు. అయితే ఆయన పిలుపును ఆస్ట్రేలియా, జపాన్ తిరస్కరించాయి.
హర్మూజ్ వద్దకు మేం ఎలాంటి నౌకలను పంపడం లేదని ఆస్ట్రేలియా వెల్లడించింది. జపాన్ నుంచి అలాంటి స్పందనే వచ్చింది. మారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్లను పరిగణనలోకి తీసుకోవడం లేదని జపాన్ పేర్కొంది. యుద్ధ నౌకలను పంపించడంపై నిర్ణయం తీసుకునేముందు అమెరికాతో చర్చలు జరుపుతామని దక్షిణకొరియా వెల్లడించింది.
ఆదివారం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో ట్రంప్ (Donald Trump) మాట్లాడుతూ.. పశ్చిమాసియా చమురుపై ఆధారపడిన దేశాలు హర్మూజ్‌ను కాపాడేందుకు ముందుకురావాలని ఒత్తిడి చేసినట్లు చెప్పారు. అయితే ఆ దేశాల పేర్లు మాత్రం వెల్లడించలేదు. ఈ ప్రాంతంలో చైనా ప్రయోజనాలే ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అయితే ఆ జలసంధిని రక్షించేందుకు చైనా ఏదైనా కూటమిలో చేరుతుందా..?లేదా..? అనే విషయాన్ని మాత్రం పేర్కొనలేదు.