గుజరాత్ వచ్చిన నందా దేవి LPG నౌక : 40 లక్షల సిలిండర్లకు గ్యాస్
ఇరాన్ యుద్ధం మధ్య భారత్‌కు ఊరటనిచ్చే వార్త అందింది. హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రాణాలకు తెగించి భారత ఇంధన నౌకలు స్వదేశానికి చేరుకుంటున్నాయి. తాజాగా నందాదేవి అనే మరో భారీ ఎల్‌పీజీ షిప్మెంట్ మార్చి 17న గుజరాత్‌లోని వాడినార్ ఓడరేవుకు సురక్షితంగా చేరుకుంది. సుమారు 47వేల మెట్రిక్ టన్నుల వంట గ్యాస్‌తో వచ్చిన ఈ నౌక.. అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతాన్ని దాటుకుని రావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో భారత్‌కు చేరుకున్న రెండో భారీ గ్యాస్ నౌకగా ఇది నిలిచింది.
నందాదేవి రాకకు ఒక రోజు ముందే శివాలిక్ అనే మరో గ్యాస్ ట్యాంకర్ 46వేల మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో ముంద్రా పోర్టుకు చేరుకుంది. కేవలం ఈ ఒక్క నౌకలో వచ్చిన గ్యాస్ సుమారు 32.4 లక్షల డొమెస్టిక్ సిలిండర్లకు సమానమని అధికారులు చెబుతున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఒక రోజుకు అవసరమయ్యే మొత్తం గ్యాస్ దిగుమతి అవసరాలను ఒక షిప్ తీర్చగలదు. హార్ముజ్ జలసంధి గుండా ప్రపంచవ్యాప్త చమురు ఎగుమతుల్లో 20 శాతం జరుగుతాయి. ప్రస్తుతం ఇక్కడ యుద్ధం జరుగుతుండటంతో భారత నౌకలు, నావికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
నౌకాయాన సంస్థలకు భరోసా ఇచ్చేలా దేశంలోని ప్రధాన ఓడరేవులు యాంకరేజ్, బెర్త్ హైర్, స్టోరేజీ ఛార్జీలలో రాయితీలు ఇస్తూ అండగా నిలుస్తున్నాయి. మరోవైపు యూఏఈలోని ఫుజైరా పోర్టుపై దాడి జరిగినప్పటికీ.. అక్కడి నుంచి సురక్షితంగా బయటపడిన ఒక భారతీయ క్రూడాయిల్ ట్యాంకర్ కూడా మంగళవారం సాయంత్రానికి భారత్ చేరుకోనుందని సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న మిగిలిన నౌకలను కూడా క్షేమంగా తీసుకువచ్చేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, నౌకాయాన శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ వరుస నౌకల రాకతో దేశంలో తలెత్తిన గ్యాస్ కొరత భయాలు క్రమంగా తొలగిపోతాయని భావిస్తున్నారు.