Iran-Israel: ఇరాన్ సైన్యాధిపతి సోలేమానీ హతం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన
పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ మరో కీలక అధికారిని పోగొట్టుకుంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ లాంటి కీలక నేతలను పోగొట్టుకున్న ఇరాన్.. తాజాగా మరో కీలక అధికారిని ఇజ్రాయెల్ అంతమొందించింది. ఈ మేరకు ఐడీఎఫ్ ఎక్స్‌లో పేర్కొంది. అలాగే ఇరాన్ ఉన్నతాధికారి అలీ లారిజానీ కూడా హతమైనట్లుగా ఇజ్రాయెల్ భావిస్తోంది. అలీ లారిజానీ మరణించారా లేదా గాయపడ్డారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఇరాన్ కూడా స్పందించలేదు. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సహా కుటుంబ సభ్యులు కీలక అధికారులు హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేసింది. దీంతో పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తీవ్ర గ్యాస్, చమురు సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.