Telangana Budget 2026-27: నేడు 3.36 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ 2026-27; అభివృద్ధి సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం!
Telangana Budget 2026-27: తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాలను అవలంభిస్తోంది. విద్య,వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతగా తీసుకొని బడ్జెట్ రూపొందించింది.
Telangana Budget 2026-27: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం సర్వన్నద్ధమైంది. ముఖ్యంగా విద్య,వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతగా తీసుకొని రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే విధంగా భారీ బడ్జెట్‌ను రూపొందించింది. ఈ దఫా బడ్జెట్ అంచనాలు అక్షరాల 3.36 లక్షల కోట్లకు చేరుకున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది బడ్జెట్ 3.04 లక్షల కోట్లు. ఈసారి సుమారు 32వేల కోట్లు రూపాయలు పెరుగుదలతో సరికొత్త రికార్డును సృష్టించబోతోంది.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాలను అవలంభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్నుల వాటా ఆదాయం ఏడాదికి మారు 4వేల కోట్ల మేర పెరగడం రాష్ట్రానికి పెద్ద ఊరటనిస్తోంది. దీనికి తోడు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా లభించే నిధులను వదులుకోకుండా రాష్ట్ర వాటాను సక్రమంగా చెల్లించ గరిష్టంగా నిధులు రాబట్టాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది.
రాష్ట్రంపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే పెద్ద ఎత్తున రుణాలను రీస్ట్రక్చర్ చేయగా రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ ప్రక్రియను కొనసాగించడం ద్వారా వడ్డీల భారం తగ్గించుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పన్నుల రాబడి కూడా ఆశాజనంగా ఉంది. సవరించిన అంచనాల ప్రకారం పన్నుల రూపేణా రూ. 1.75 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని భావించగా అందులో 92 శాతం మేర ఇప్పటికే వసూలైంది. జీఎస్టీ స్లాబ్‌లలో మార్పులు జరిగినప్పటికీ ఆదాయం తగ్గకపోవడం విశేషం. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది పన్నుల ఆదాయ లక్ష్యాన్ని 1.90 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుభ ముహూర్తాన్ని ఎంచుకున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో ఆయన బడ్జెట్ శాసనసభ ముందు ఉంచుతారు. అదే శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రసంగం చేస్తారు. అంతకు ముందు ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ లాబీల్లోని కమిటీ హాల్‌లో రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు అధికారికంగా ఆమోదం తెలపనుంది.