ఇండియన్ ఆయిల్ భారీ షాక్: ఇండస్ట్రియల్ డీజిల్ ధర లీటరుకు రూ. 22 పెంపు
యుద్ధం ఎఫెక్ట్ సామాన్య వాహనదారుల నుంచి పరిశ్రమలకు కూడా తాకుతోంది. కొద్ది రోజుల కిందట గ్యాస్ ధరలు పెంచేసిన ఆయిల్ కంపెనీలు శుక్రవారం రోజున పవర్ పెట్రోల్ అలాగే ఇండస్ట్రియల్ డీజిల్ అమ్మకపు రేట్లను అమాంతం పెంచేశాయి. ఇరాన్ యుద్ధం రోజుల నుంచి నెలలకు సాగుతుందనే వార్తల మధ్య క్రూడ్ ధరలు పెరగటం.. సముద్రం మధ్యలోనే షిప్స్ ఆగిపోవటంతో నెలకొన్న షార్టేజీ ప్రభావం భారతదేశంలో మెుదలైంది. దీంతో పారిశ్రామిక వినియోగదారులపై ఇంధన ఖర్చులు పెరిగి పరోక్షంగా వస్తుసేవల ధరల పెరగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారతీయ పారిశ్రామిక రంగానికి షాక్ ఇస్తూ ఆయిల్ కంపెనీలు ఇండస్ట్రియల్ డీజిల్ ధరను భారీగా పెంచాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) బల్క్ డీజిల్ ధరను లీటరుకు ఏకంగా లీటరుకు రూ.22 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో నిన్నటి వరకు రూ.87.57 గా ఉన్న లీటరు డీజిల్ ధర.. ఇప్పుడు తాజా రేట్ల పెంపుతో రూ.109.59కి చేరుకుంది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో లభించే డీజిల్ ధరలపై ప్రస్తుతం పెద్దగా ప్రభావం లేనప్పటికీ.. నేరుగా కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ కొనే పారిశ్రామిక వినియోగదారులకు షాక్ తగిలింది.
ఈ ధరల పెరుగుదల ప్రభావం ప్రధానంగా తయారీ రంగం, భారీ పరిశ్రమలు, లాజిస్టిక్స్ విభాగాలపై తీవ్రంగా ఉండనుంది. సిమెంట్, ఉక్కు కర్మాగారాలు, భారీ యంత్రాలను నడిపే పరిశ్రమలకు డీజిల్ వినియోగం అత్యవసరం. లీటరుకు రూ.22 పెరగడం వల్ల వారి ఉత్పత్తి వ్యయం అమాంతం పెరుగుతుంది. అలాగే నేరుగా కంపెనీల నుంచి డీజిల్ కొనే భారతీయ రైల్వే, రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు వల్ల రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి దారితీసి సామాన్య ప్రజల జేబుపై ప్రభావం చూపుతుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల మార్కును దాటడంతో, చమురు కంపెనీలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నాయి. సాధారణంగా రిటైల్ వినియోగదారుల కంటే బల్క్ వినియోగదారులకే తక్కువ ధర ఉండాలి. కానీ తాజా పరిస్థితుల వల్ల రిటైల్ ధరల కంటే ఇండస్ట్రియల్ ధరలు ఎక్కువుగా మారాయి. ఈ వ్యత్యాసం వల్ల పరిశ్రమలు తమకు కావలసిన డీజిల్‌ను రిటైల్ బంకుల వద్దే కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరోపక్క డీజిల్ బ్లాక్ మార్కెటింగ్ పెరగటం వల్ల సాధారణ వినియోగదారులకు డీజిల్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. దీనివల్ల సాధారణ బంకుల వద్ద డీజిల్ కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి రాయితీలు కల్పించకపోతే.. దేశీయ ఉత్పాదక రంగం కుంటుపడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.