... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
సంక్షోభ సమయం

సంక్షోభ సమయం

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగానే ఉండబోతున్నదనీ, అది దీర్ఘకాలం కొనసాగుతుందనీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సంకేతాలు సహజంగానే అందరినీ కలవరపెడతాయి. ఆయన సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చేసిన ప్రసంగాల్లో ఆరేళ్ల క్రితం కోవిడ్‌ రోజుల నాటి పరిస్థితులతో వర్తమాన స్థితిని పోల్చారంటే దేశం మున్ముందు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి 23 రోజుల క్రితం ఇరాన్‌పై ప్రారంభించిన యుద్ధం ట్రంప్‌ తాత్కాలిక విరామం ప్రకటన తర్వాత ఆగిన సంకేతాలు కనబడినా, యుద్ధ విరమణ ఉండబోదన్న ఇజ్రాయెల్‌ తీరు చూస్తే అందరిలోనూ సందేహాలు కలుగుతున్నాయి.

అంతేకాదు... అటు ఇరాన్‌ సైతం అమెరికాతో చర్చించలేదని చెబుతోంది. చివరకు అదేమవుతుందన్న సంగతలా ఉంచితే, ఇప్పటికే ప్రపంచంతోపాటు మనమూ సంక్షోభంలో చిక్కుకుపోయామని తెలుస్తూనే ఉంది. క్షణక్షణం మాట మార్చే ట్రంప్‌ను ఇరాన్‌తోపాటు ప్రపంచ ప్రజానీకం కూడా పెద్దగా విశ్వసించలేదుగానీ... స్టాక్‌ మార్కెట్లు మాత్రం నమ్మదల్చుకున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. మార్కెట్లన్నీ మంగళవారం ఉత్సాహంతో ఉరకలెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా 10 శాతం పడిపోయాయి. కానీ ఈ ధోరణి దీర్ఘకాలం కొనసాగటం అనుమానమే.

యుద్ధంపై కేంద్రం నుంచి వెలువడిన ఈ తొలి ప్రకటన సాధారణ జనంలో కొద్ది రోజులుగా ఉన్న భయాందోళనలు నిర్హేతుకం కాదని సూచిస్తోంది. ఆర్థిక, జాతీయ భద్రతా రంగాలతోపాటు మానవతారంగంలోనూ పెను సవాళ్లను ఎదుర్కొనబోతున్నామని ప్రధాని చెబుతున్నారు. మన ఆర్థిక ప్రగతికి ప్రధానంగా తోడ్పడే చమురు, సహజవాయువుల్లో సింహభాగం పశ్చిమాసియా నుంచే రావాలి. ఆ ప్రాంతం మామూలు స్థితికి చేరేదాకా ఆ రెండు దిగుమతులపైనా అనిశ్చితి కొనసాగుతుంది.

గల్ఫ్‌ దేశాల్లో భిన్న వృత్తి ఉద్యోగాల్లో ఉన్న కోటిమంది భారతీయుల్లో 3 లక్షల మంది ఇప్పటికే వెనక్కొచ్చారు. ఇరాన్‌ ప్రతిదాడుల వల్ల గల్ఫ్‌ దేశాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. చమురు, గ్యాస్‌ ఎగుమతులు నిలిచిపోవటం వల్ల అవి గడ్డు పరిస్థితుల్లో పడ్డాయి. జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. తమ గ్యాస్‌ ఉత్పాదక క్షేత్రాన్ని చక్కదిద్దటానికి చాలా ఏళ్లు పట్టవచ్చని ఖతార్‌ అంటున్నది. కనుక గల్ఫ్‌లో ఉపాధి కల్పన మళ్లీ పట్టాలెక్కడం అంత సులభం కాదు.

 గల్ఫ్‌ సంక్షోభంతో రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన స్థాయిలో ఎరువులు అందుతాయా అన్న సందేహాలున్నాయి. సాగుకు లోటురానీయబోమని మోదీ హామీ ఇవ్వడం అందుకే. ఆయన చెబుతున్న ప్రకారం కొన్ని శక్తులు ఈ సంక్షోభాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకునే ప్రయత్నం చేస్తాయి. అది ఆంతరంగిక భద్రతపై ప్రభావం చూపుతుంది. దేశం ఐక్యంగా ఉండి ఈ సంక్షోభాన్ని అధిగమించాలని ఆయన పిలుపునిచ్చారు.

Source : Sakshi

1 hour ago

Home Flash News