విలక్షణ నటుడి ఇంట విషాదం.. కన్న తల్లిని కోల్పోయిన ప్రకాశ్ రాజ్
బెంగళూరు: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణ లత (86) సోమవారం ఉదయం కన్నుమూశారు. ఇంట్లోనే ఆమె తుది శ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం బెంగుళూరులో ప్రకాశ్ రాజ్ తల్లికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కన్న తల్లి చనిపోవడంతో ప్రకాష్ రాజ్ శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కొన్ని నెలలుగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రకాష్ రాజ్ తల్లి సువర్ణ లత రోమన్ కేథలిక్. ప్రకాష్ రాజ్ తండ్రి హిందువు. ఇలా ఒకే ఇంట్లో వైవిధ్య నేపథ్యాలు ఉన్నప్పటికీ ప్రకాష్ రాజ్ ఈ రెండు మతాల్లో ఏ మతం వైపూ అడుగు వేయలేదు. ఇంట్లో ఉన్న పరిస్థితులకు భిన్నంగా నాస్తికుడిగా మారారు. ఆయన దేవుడిని నమ్మరు.
ప్రకాష్ రాజ్ తల్లి సువర్ణ లత చిన్న వయసులోనే ఎన్నో కష్టనష్టాలను చవిచూసింది. అనాథగా పెరిగింది. హాస్పిటల్లో నర్సుగా పనిచేసింది. ఆ క్రమంలోనే పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆమె జీవితంలో చాలా కష్టాలే పడింది. ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసింది. నర్సుగా ఉద్యోగం చేస్తూ ఇంటిల్లిపాదినీ ఆమెనే పోషించింది.
ప్రకాష్ రాజ్ లాంటి కొడుకు ఉండటం తన అదృష్టమని సువర్ణ లత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తనను తల్లిలా కాకుండా ఒక దేవతలా చూస్తాడని.. కన్న తల్లి కంటే ఏదీ ఎక్కువ కాదని ప్రకాష్ రాజ్ భావిస్తాడని.. తన కష్టాల్లో, బాధల్లో.. అన్నింటిలో తన బిడ్డ తనతో పాటే ఉన్నాడని ఆ ఇంటర్వ్యూలో సువర్ణ లత భావోద్వేగానికి లోనయ్యారు. ప్రకాష్ రాజ్కు కన్నతల్లితో అంతటి అనుబంధం ఉంది.