భాజపాతో జట్టు కట్టే పార్టీలకు భవిష్యత్తు ఉండదు: కనిమొళి
Assembly elections | ఇంటర్నెట్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో నాయకులు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా భాజపా- అన్నాడీఎంకే పొత్తుపై డీఎంకే ఎంపీ కనిమొళి (Kanimozhi) తీవ్ర విమర్శలు చేశారు. భాజపా (BJP)తో పొత్తు పెట్టుకునే రాజకీయ పార్టీలకు భవిష్యత్తు అంధకారంగా మారిపోతుందన్నారు. డీఎంకే అభ్యర్థి తరఫున ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..
డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అంటూ భాజపా కూటమి చేస్తున్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. అన్నాడీఎంకే తీసుకున్న రాజకీయ నిర్ణయాలు తమిళనాడు ప్రయోజనాలకు భంగం కలిగించాయని ఆమె ఆరోపించారు. భాజపాతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా వృద్ధి సాధించినట్లు చరిత్రలో లేదన్నారు. కాషాయ పార్టీతో అన్నాడీఎంకే (AIADMK) పెట్టుకున్న పొత్తును మోసపూరిత కూటమిగా అభివర్ణించారు. ఈ పొత్తుతో రాష్ట్ర ప్రజలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలను కూడా మోసం చేశారన్నారు. కాగా.. 234 శాసనసభ స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే 164 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మరో 70 స్థానాలను కాంగ్రెస్ సహా తమ మిత్రపక్షాలకు కేటాయించింది.