ఆర్మీ చేతికి కాముకాజి ఆయుధం.. రూ.10 కోట్లకే వందల ఆత్మాహుతి డ్రోన్లు
ఇంటర్నెట్ డెస్క్: భారత సైన్యం అమ్ములపొదిలో మరో అధునాతన ఆయుధం చేరింది. ఆధునిక సాంకేతిక యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే ఆత్మాహుతి డ్రోన్లు (కాముకాజి) ఆర్మీ చేతికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రకానికి చెందిన వందలాది డ్రోన్లను స్వదేశీ సంస్థ తాజాగా సైన్యానికి (Indian Army) అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు రక్షణశాఖ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. రూ.10 కోట్ల ఒప్పందంలో భాగంగా వీటిని అందజేసినట్లు తెలిసింది.
గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఘటన నేపథ్యంలో.. సరిహద్దుల రక్షణ విషయంలో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ప్రాణనష్టం జరగకుండా.. శత్రు మూకల్ని అంతం చేసేందుకు వీలుగా ఆత్మాహుతి డ్రోన్లను (Suicide Drones) సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబరులో కేంద్ర రక్షణశాఖ పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులోభాగంగానే తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ‘ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ’ అనే సంస్థ వందలాది ఆత్మాహుతి డ్రోన్లను ఆర్మీ నార్తర్న్ కమాండ్‌కు డెలివరీ చేసినట్లు సమాచారం. అయితే, భద్రతా కారణాల రీత్యా ఎన్ని డ్రోన్లను అప్పగించారన్న దానిపై కచ్చితమైన సమాచారం బయటకు రాలేదు. కేవలం రెండు నెలల్లోనే ఈ డ్రోన్లను డెలివరీ చేయడం విశేషం. అత్యవసర కొనుగోలు కింద సైన్యం వీటిని తీసుకున్నట్లు తెలుస్తోంది.