ఇజ్రాయెల్‌ని తిట్టి.. పోస్ట్ డిలీట్: మంత్రి నిర్ణయం వెనక మునీర్ ఒత్తిడి!
ఇంటర్నెట్‌డెస్క్: లెబనాన్‌లో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోందంటూ పాకిస్థాన్ (Pakistan) రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన పోస్టు వివాదాస్పదమైంది. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో తటస్థ పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్న దేశం నుంచి ఇలాంటి ప్రకటనలు రావడం ఏంటని ఇజ్రాయెల్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశాన్ని క్యాన్సర్‌తో పోల్చిన ఖవాజా తర్వాత ఆ పోస్టు డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ జోక్యంతోనే ఖవాజా వెనక్కి తగ్గినట్లు భారత నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
పాక్ మంత్రులు బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్ల ఆ దేశ మధ్యవర్తిత్వ పాత్రకు ప్రాధాన్యం తగ్గి.. సీజ్‌ఫైర్ ప్రక్రియకు అంతరాయం కలగవచ్చనే ఉద్దేశంతోనే మంత్రిపై మునీర్ ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. పాక్ తటస్థ పాత్రను ఇలాంటి చర్యలు దెబ్బతీస్తాయని మునీర్ భావించి ఉంటాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ శాంతి చర్చల ప్రక్రియ విఫలమైతే గల్ఫ్‌లో మళ్లీ ఘర్షణలు చెలరేగితే ఇంధన ధరలు భగ్గుమంటాయి. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాక్ పరిస్థితిని ఈ పరిణామాలు మరింత దిగజార్చుతాయనే ఆందోళన కూడా మునీర్ జోక్యానికి కారణం కావొచ్చనే వాదనలు కూడా వినబడుతున్నాయి.
పశ్చిమాసియాలో అస్థిరతలు తన సరిహద్దుల వరకు విస్తరించి, ఉగ్రవాద కార్యకలాపాలు పెరగవచ్చనే భయం కూడా పాక్‌కు లేకపోలేదు.
ఇజ్రాయెల్- పాక్ మధ్య మాటల యుద్ధం
ఇవన్నీ ఒక ఎత్తైతే.. మునీర్ సారథ్యంలోని సైన్యం పాక్ విదేశాగ విధానంపై తిరుగులేని నియంత్రణను కలిగి ఉందని, పౌర ప్రభుత్వ అధికారం పరిమితమేనని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా-ఇరాన్ చర్చలు సహా పలు కీలక దౌత్యపరమైన అంశాల్లో పౌర నాయకత్వాన్ని పక్కన పెడుతున్నారనే దానికి తాజా ఘటన అద్దంపడుతోందని తెలిపాయి.