Select Location
All Locations
State
Region
City / District
T20 WC 2026: మ్యాచ్‌ ఫిక్సింగ్‌!.. రంగంలోకి ఐసీసీ

T20 WC 2026: మ్యాచ్‌ ఫిక్సింగ్‌!.. రంగంలోకి ఐసీసీ

భారత్‌ వేదికగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 ప్రపంచకప్‌-2026 జరిగింది. టైటిల్‌ పోరులో టీమిండియా- న్యూజిలాండ్‌ తలపడగా ఆతిథ్య జట్టు చాంపియన్‌గా నిలిచింది. సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో భారత్‌ ట్రోఫీని ముద్దాడింది. ఫిక్సింగ్‌ ఆరోపణలు ఈ మెగా టోర్నీ ముగిసిన దాదాపు నెలన్నర తర్వాత సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఈవెంట్లో ఫిక్సింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) అవినీతి నిరోధక విభాగం రంగంలోకి దిగింది. గ్రూప్‌-డి మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్‌- కెనడా మధ్య జరిగిన పోరుపై ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణకు ఆదేశించింది.

టీ20 ప్రపంచకప్‌-2026లో న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో కలిపి కెనడాను గ్రూప్‌-డిలో వేశారు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా కెనడా అసాధారణ ప్రదర్శన కనబరిచింది. చెన్నై వేదికగా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించింది. యువరాజ్‌ సమ్రా సంచలన సెంచరీ ఓపెనర్‌ యువరాజ్‌ సమ్రా సంచలన సెంచరీ (65 బంతుల్లో 110)తో మెరిశాడు. ఇక లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ విధ్వంసకర ఓపెనర్లు టిమ్‌ సీఫర్ట్‌ (6), ఫిన్‌ అలెన్‌ (21) వెనువెంటనే పెవిలియన్‌ చేరారు. ఇలాంటి తరుణంలో కెనడా కెప్టెన్‌ దిల్‌ప్రీత్‌ బజ్వా పవర్‌ ప్లేలో భాగంగా ఐదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చాడు. 

దిల్‌ప్రీత్‌ వ్యవహారశైలిపై అనుమానాలు నిజానికి దిల్‌ప్రీత్‌ రెగ్యులర్‌ బౌలర్‌ కాదు. అలాంటిది అతడు బౌలింగ్‌కు రావడమే కాకుండా రెండు ఓవర్లు బౌల్‌ చేశాడు. మొత్తంగా 26 పరుగులు ఇచ్చుకుని వికెట్‌ తీయలేకపోయాడు. బ్యాటింగ్‌లోనూ అతడు తేలిపోయాడు. 39 బంతుల్లో 36 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో దిల్‌ప్రీత్‌ వ్యవహారశైలిపై అనుమానాలు రేకెత్తాయి. పటిష్ట న్యూజిలాండ్‌పై గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించే క్రమంలో మెరుగైన స్థానంలో ఉన్నా.. కెనడా ఆఖరికి ఓటమిపాలైంది. ఇందుకు దిల్‌ప్రీత్‌ కారణమనే ఆరోపణలు రాగా.. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణకు ఆదేశించింది. వెలుగులోకి ఎలా వచ్చింది? ది ఫిఫ్త్‌ స్టేట్‌ అనే కెనడా ఇన్వెస్టిగేటివ్‌ డాక్యుమెంటరీ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇటీవల.. ‘అవినీతి.. నేరం.. క్రికెట్‌’ అనే డాక్యుమెంటరీ విడుదల చేసింది. 

ఇందులో కెనడా క్రికెటర్లు దేశీ, అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టింది. కాగా టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి కొన్ని వారాల ముందే దిల్‌ప్రీత్‌ బజ్వా కెనడా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం గమనార్హం. అంతకు ముందు కోచ్‌ ఖుర్రం చోహన్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. బుకీలతో అతడు సంబంధాలు కలిగి ఉన్నాడనే వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కెనడా క్రికెట్‌ గనుక దోషిగా తేలితే ఐసీసీ నుంచి కఠిన చర్యలు తప్పవు.


Sakshi 1 hour ago
Home Flash News