వారసత్వ రాజకీయాల కోసమే మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని, ఈ దేశంలోని కోట్లాది మంది ఆడబిడ్డల ఆశలను కాంగ్రెస్ పార్టీ సమాధి చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత నారీశక్తి చరిత్రలో ఏప్రిల్ 17 ఒక చీకటి రోజు అని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును కాంగ్రెస్, దాని మిత్రపక్షమైన ఇండియా కూటమి వ్యతిరేకించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఈ పాపం పండే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధాని అయిన నరేంద్ర మోదీకి సామాన్య మహిళల కష్టాలు తెలుసని, అందుకే వారికి చట్టసభల్లో రాజ్యాధికారం దక్కాలని చరిత్రాత్మక బిల్లు తెచ్చారని రాంచందర్ రావు చెప్పారు. ‘కాంగ్రెస్‌లో కేవలం ఇందిరా గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీలకు మాత్రమే అధికారం ఉండాలి. సామాన్య పేద ఇంటి ఆడబిడ్డలు నాయకులు కాకూడదనేదే ఆ పార్టీ కుట్ర. వారసత్వ రాజకీయాల కోసమే మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నారు’ అని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ కేవలం ముస్లిం కోసమే ఈ బిల్లును వ్యతిరేకించారని రాంచందర్ రావు విమర్శించారు. ముస్లింలకు రిజర్వేషన్లు లేవనే సాకుతో కోట్ల మంది మహిళల 33 శాతం రిజర్వేషన్ హక్కును కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మహిళా ద్రోహిగా మిగిలిపోతుందన్నారు. మహిళల ఎదుగుదలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టాలని రాష్ట్ర మహిళా లోకానికి రాంచందర్ రావు పిలుపునిచ్చారు. నేడు సీఎం ఇంటి వద్ద నిరసన పార్లమెంట్ లో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ శనివారం సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద నిరసన తెలపనున్నట్టు బీజేపీ వర్గాలు ప్రకటించాయి. ఉదయం 11గంటలకు జూబ్లీ హిల్స్ లోని సీఎం ఇంటి వద్ద జరిగే నిరసనలో రాంచందర్‌రావుతో పాటు పలువురు నేతలు పాల్గొంటారని వెల్లడించారు.