Select Location
All Locations
State
Region
City / District
BAN vs PAK: పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఒకేసారి నలుగురికి!

BAN vs PAK: పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఒకేసారి నలుగురికి!

బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 16 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు వెట‌ర‌న్ బ్యాట‌ర్ షాన్ మ‌సూద్ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. అదేవిధంగా ,అబ్దుల్లా ఫజల్, అమాద్ బట్, అజాన్ అవైస్, ముహమ్మద్ ఘాజీ ఘోరి వంటి యువ ఆట‌గాళ్ల‌కు తొలిసారి పాక్ జాతీయ జ‌ట్టులో చోటు ద‌క్కింది. ఇమామ్‌ ఉల్‌ హక్‌, షాహీన్‌ షా అఫ్రిది, బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌ వంటి సీనియర్‌ ప్లేయర్లు ఈ జట్టులో ఉన్నారు. మరోవైపు ఈ బంగ్లా టూర్‌లో పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా మాజీ టెస్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా మాజీ క్రికెటర్లు అసద్ షఫీక్, ఉమర్ గుల్ బ్యాటింగ్‌, బౌలింగ్ కోచ్‌లగా సేవలందించనున్నారు.

ఇక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27లో భాగంగా ఈ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. వచ్చే నెల 8 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్ ఢాకా వేదికగా జరగనుండగా.. రెండో టెస్టుకు సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే లహోర్‌లోని ఎన్సీఎలో శిక్షణా శిబిరం ఏర్పాటు చేసింది. ఇందులో అజాన్ అవైస్, ఇమామ్-ఉల్-హక్, ముహమ్మద్ ఘాజీ ఘోరి, నోమన్ అలీ,సాజిద్ ఖాన్ వంటి వారు పాల్గొంటున్నారు. మరో ట్రైనింగ్ క్యాంప్ ఏప్రిల్ 27 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న టెస్టు జట్టు సభ్యులు, తమ షెడ్యూల్ ముగించుకుని ట్రైనింగ్ క్యాంప్‌లో చేరుతారు. ఏ జట్లైతే ఫైనల్‌కు చేరుకుంటాయో, ఆ ఆటగాళ్లు టోర్నమెంట్ ముగిసిన తర్వాత నేరుగా బంగ్లాదేశ్‌కు చేరుకుంటారు.


Sakshi 1 hour ago
Home Flash News