కాంగ్రెస్ పార్టీ.. మహిళా ద్రోహిగా మిగిలిపోతుంది : కిషన్రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: మహిళలు, దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగే బిల్లును అడ్డుకొని కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు చారిత్రక తప్పిదం చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు, బిల్లును వ్యతిరేకించిన పార్టీలు చరిత్రలో మహిళా ద్రోహులుగా నిలిచిపోతాయన్నారు. అసలు ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు ఇండియా కుటమి నేతలకు చెప్పలేకపోయారన్నారు.
వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశ, నిస్పృహ కాంగ్రెస్‌లో కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. శనివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేలా ప్రధాని మోదీ మంచి ఫార్ములాను తీసుకువచ్చారన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగాలని గతంలో చేసిన చట్టంలోనే ఉందన్నారు.
మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం ఇది మొదటిసారి కాదని, రెండు నాల్కల ధోరణితో మొత్తంగా 7 సార్లు కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు అడ్డుకున్నాయన్నాయని ఆరోపించారు. తొలిసారి 1996లో దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు.. ఆ తర్వాత 98, 99, 2002లో వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అడ్డుకున్నారని చెప్పారు. బిల్లు పేపర్లను చించి స్పీకర్ మీద, ప్రధానిపై వేశారని, 2008–10 లో మన్మోహన్ ప్రభుత్వం బిల్లు పెడితే..
సమాజ్ వాద్ పార్టీ, ఆర్జేడీ పార్టీలను ప్రోత్సహించి బిల్లును అడ్డుకునేలా చేశారన్నారు. నాడు.. కాంగ్రెస్ మిత్రపక్షాలు.. మేం గిల్లినట్టు చేస్తం, మీరు ఏడ్చినట్టు చేయండన్నట్టుగా కాంగ్రెస్ తో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించాయని, శుక్రవారం కూడా అదే తరహాలో అన్నీ పార్టీలు కలిసి మహిళాబిల్లును అడ్డుకున్నాయని విమర్శించారు.