Select Location
All Locations
State
Region
City / District
చమురు కోసం.. రష్యా బీమా సంస్థలకు భారత్‌ అవకాశం

చమురు కోసం.. రష్యా బీమా సంస్థలకు భారత్‌ అవకాశం

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌కు చమురు సరఫరాలో ఆటంకాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. తాజాగా రష్యా నుంచి చమురు దిగుమతికి అవసరమైన బీమా సేవలను విస్తృతం చేయాలని నిర్ణయించింది. దీనిలోభాగంగా 11 రష్యా బీమా సంస్థలకు భారత్‌లో అనుమతులు మంజూరు చేసింది. వాస్తవానికి ఈ సంస్థలు నౌకా రవాణాలో బీమాలను అందించే పీ అండ్‌ ఐ క్లబ్స్‌ (ప్రొటెక్షన్‌ అండ్‌ ఇండెమ్నిటీ)లో మెంబర్స్‌ కాకపోవడం గమనార్హం. 

ఇరాన్‌-అమెరికా పోటీపడి హర్మూజ్‌ను దిగ్బంధించడంతో చమురు నౌకలు ఈ జలసంధిని దాటడం చాలా కష్టంగా మారింది. మరోవైపు రష్యాకు చెందిన చాలా చమురు నౌకలు ఈ మార్గంలో కాకుండా ఎర్ర సముద్రం మీదుగా ఆసియాలోని తమ గమ్యస్థానాలకు చేరతాయి. అందుకే భారత్‌ మాస్కో వైపు మొగ్గు చూపింది. వీటిల్లో గ్యాస్‌ప్రోమ్‌ ఇన్స్యూరెన్స్‌, రోస్‌గోస్‌ట్రాక్‌, బ్యాలెన్స్‌, సోగ్లాసీ, ఉగోరియా గ్రూప్‌, స్బెర్‌బ్యాంక్‌, ఏఎస్‌టీకే బీమా సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు గత వారం అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ కూడా అనుమతులను పొడిగించింది. ఐరోపా కేంద్రంగా పనిచేసే ‘ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ ఆఫ్‌ పీఅండ్‌ఐ క్లబ్స్‌’ సంస్థే థర్డ్‌పార్టీ, పొల్యూషన్‌, కార్గో డ్యామేజ్‌ వంటివి కవర్‌ చేస్తూ అత్యధికంగా బీమా పాలసీలు ఇస్తాయి. ప్రపంచ సముద్ర రవాణాలో ఈ సంస్థ వాటా 87% వరకు ఉంది. అమెరికా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ సంస్థ రష్యా నౌకలకు బీమా పాలసీలు ఇవ్వదు.


Eenadu Telugu 1 hour ago
Home Flash News