Select Location
All Locations
State
Region
City / District
శబరిమల అయ్యప్ప ఆలయంపై హెలికాప్టర్ చక్కర్లు ..ఆలయ భద్రతపై ఆందోళన

శబరిమల అయ్యప్ప ఆలయంపై హెలికాప్టర్ చక్కర్లు ..ఆలయ భద్రతపై ఆందోళన

శబరిమల అయ్యప్పస్వామి ఆలయం దగ్గర గందరగోళం నెలకొంది. గురువారం ఆలయం గర్భగుడిపై హెలికాప్టర్ చక్కర్ల కొట్టింది. దీంతో ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తాయి. హెలికాప్టర్ ఎక్కడినుంచి వచ్చింది.. ఎందుకు ఆలయంపై చక్కర్లు కొట్టింది అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.. విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాలని హైకోర్టు నియమించిన కమిషన్ ఆదేశించింది.

గురువారం ఉదయం 11గంటల సమయంలో ఓ హెలికాప్టర్ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం గర్భగుడిపై సుమారు 30 సెకన్లపాటు చాలా తక్కువ ఎత్తులో ఎగిరింది. ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం..ఆ విమానం ఆలయ ధ్వజస్తంభానికి (కొడిమరం) ఐదు మీటర్ల సమీపానికి దిగింది. ఓ వ్యక్తి ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో బంధించారు. ఆలయ నిర్మాణానికి ఇంత సమీపంలో హెలికాప్టర్ ఎగరడం ఇదే మొదటి సారి. శబరిమల ఆలయంనుంచి నీలక్కల్ వరకు ఉన్న పరిసర ప్రాంతాలు సున్నితమైన సెక్యూరిటీ ప్రాంతాలుగా ఉన్నాయి. 

మతపరంగా నిషేధిత ప్రదేశంలో హెలికాప్టర్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం ,తక్కువ ఎత్తులో ప్రయాణించడంతో ఆలయ భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. శబరిమల ఆలయంపై హెలికాప్టర్ ఎగరడంతో భద్రతాపరమైన ఆందోళనలు తలెత్తాయి. ఈ ఘటనపై విచారణ జరిపి, సమగ్ర నివేదిక ఇవ్వాలని శబరిమల భద్రతా బాధ్యతలు చూస్తున్న ఏడీజీపీ శ్రీజిత్‌ను హైకోర్టు నియమించిన ప్రత్యేక కమిషనర్ ఆర్. జయకృష్ణన్ ఆదేశించారు.

అయితే ఆలయంపై ఎగిరింది కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ గా గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ నిఘా కోసం ఈ హెలికాప్టర్ పనిచేస్తుందని, ఈ సాధారణ సెక్యూరిటీ నిఘాలో భాగమేనని కొచ్చిలోని రక్షణ శాఖ పీఆర్ వో చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.


V6 News 1 day ago
Home Flash News