మెటా, మైక్రోసాఫ్ట్ బాటలో ఒరాకిల్.. భారీగా ఉద్యోగాల కోత.. ఐటీ కొలువుల్లో ప్రకంపనలు..
ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ ఈ మధ్య కాలంలోనే అత్యంత భారీ ఉద్యోగాల తొలగింపును చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 వేల నుండి 30 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా, భారత్, కెనడా, లాటిన్ అమెరికా దేశాల్లోని ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది. తెల్లవారుజామునే ఇ-మెయిళ్ల ద్వారా ఈ చేదు వార్తను కంపెనీ సిబ్బందికి తెలిపింది.
ఈ తొలగింపుల్లో కేవలం జూనియర్లే కాకుండా, మూడు దశాబ్దాలకు అంటే 30 ఏళ్లకు పైగా సంస్థకు సేవలు అందించిన సీనియర్ అధికారి కూడా ఉన్నారు. ఆమె పేరు నీనా లూయిస్. 1990లో ఒరాకిల్‌లో చేరిన ఈమె, సీనియర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్‌గా 33 ఏళ్లు పనిచేశారు. ఆమె లింక్డ్‌ఇన్‌లో ద్వారా... నాలాంటి 30 వేల మంది ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డున పడటం దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు. ఎక్కువ జీతం లేదా స్టాక్ ఆప్షన్స్ ఉన్న సీనియర్లను గుర్తించడానికి కంపెనీ ఒక ప్రత్యేక అల్గోరిథం (Algorithm) వాడి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
ఉద్యోగాల కోత కేవలం ఒరాకిల్‌కే పరిమితం కాలేదు. గత నెలలో మరికొన్ని ప్రముఖ సంస్థలు కూడా ఇదే బాట పట్టాయి. మెటా & మైక్రోసాఫ్ట్ ఈ రెండు కంపెనీలు కలిపి సుమారు 20 వేల మందిని తొలగించాయి. వినోద, సెమీకండక్టర్ రంగాల్లోని డిస్నీ & ASML సంస్థలు కూడా సిబ్బందిని తగ్గించుకున్నాయి. కేవలం నష్టాల్లో ఉన్న కంపెనీలే కాకుండా, భారీ లాభాలు పొందుతున్న సంస్థలు కూడా ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తీసివేస్తున్నాయి.
కంపెనీలు ఇప్పుడు మ్యాన్ పవర్ కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాయి. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు చూస్తే ఒకటి ఆటోమేషన్.. రోజు చేసే పనులను ఏఐ ద్వారా ఈజీగా చేయడం. ఇంకొకటి ఖర్చు తగ్గింపు అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆశించడం. ఉద్యోగులను తగ్గించడం వల్ల కంపెనీ లాభదాయకత పెరుగుతుందని పెట్టుబడిదారులు భావిస్తారు, దీనివల్ల షేర్ ధరలు పెరుగుతాయి.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితి అటు అనుభవజ్ఞులకు, ఇటు కొత్తగా వచ్చే వారికి సవాలుగా మారింది. సీనియర్ ఉద్యోగులు, ఎక్కువ జీతాలు తీసుకునే మేనేజర్లు, డైరెక్టర్ల స్థానంలో ఏఐని లేదా తక్కువ జీతానికి వచ్చే యువతను నియమిస్తున్నారు. పెద్ద కంపెనీలు నియామకాలను నిలిపివేయడంతో ఫ్రెషర్లకు అవకాశాలు తగ్గిపోయాయి. ఎంట్రీ-లెవల్ పనులన్నీ ఇప్పుడు ఏఐ ద్వారా జరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయంగా 100 శాతం ఉద్యోగ గ్యారంటీ లేకపోవడంతో, చాలా మంది అభ్యర్థులు తక్కువ జీతంతోనైనా అనుభవం సంపాదించి, ఆపై సొంతంగా స్టార్టప్‌లు ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.