దిల్లీ vs ఆర్సీబీ మ్యాచ్.. ఈ రికార్డులు నమోదవుతాయా?
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (DC vs RCB) మరోసారి తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ గెలిచింది. ఆ ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. ఇదిలా ఉండగా.. ఇవాళ్టి మ్యాచ్‌లో పలువురు బ్యాటర్లు, బౌలర్లు తమ కెరీర్‌లో కొత్త మైలురాళ్లను అందుకునే అవకాశాలున్నాయి. సొంతగడ్డపై కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడా? తన సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ పలు రికార్డులను నెలకొల్పే అవకాశముంది.
విరాట్ మరో 111 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో 9 వేల రన్స్ పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ‘కింగ్’ మరో 68 పరుగులు చేస్తే భారత గడ్డపై 10 వేల టీ20 రన్స్ చేసిన ప్లేయర్‌గా అవతరిస్తాడు. దిల్లీతో మ్యాచ్‌లో కోహ్లీ 6 సిక్స్‌లు బాదితే టీ20 క్రికెట్‌లో 450 సిక్స్‌లు పూర్తి చేసుకుంటాడు.
టీ20ల్లో 350 వికెట్ల క్లబ్‌లో చేరడానికి ఆర్సీబీ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరో నాలుగు వికెట్ల దూరంలో ఉన్నాడు. జోష్ హేజిల్‌వుడ్ మరో వికెట్ తీస్తే ఆర్సీబీ తరఫున 50 వికెట్లు పూర్తిచేసుకుంటాడు. దిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరో 18 రన్స్ చేస్తే టీ20 క్రికెట్‌లో 8,500 పరుగుల మైలురాయి అందుకుంటాడు. దిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మరో 6 సిక్సర్లు బాదితే ఐపీఎల్ 100 సిక్స్‌ల మార్క్ చేరుకుంటాడు. మరో నాలుగు బౌండరీలు కొడితే టీ20ల్లో 250 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు.
ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ కలను నెరవేర్చిన కెప్టెన్ రజత్ పటిదార్‌కు బెంగళూరు తరఫున ఇది 50వ మ్యాచ్. దిల్లీ ఆటగాడు డేవిడ్ మిల్లర్ మరో 11 పరుగులు చేస్తే టీ20 క్రికెట్‌లో 12 వేల రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో చేరతాడు. ఆర్సీబీ వికెట్‌కీపర్ జితేశ్ శర్మ ఐపీఎల్‌లో 50 క్యాచ్‌లు పూర్తి చేసుకోవడానికి కేవలం ఒక క్యాచ్ దూరంలో ఉన్నాడు. డీసీ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ మరో రెండు వికెట్లు పడగొడితే టీ20ల్లో 250 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.