అమెరికా పాస్‌పోర్టులపై ట్రంప్ ఫొటో
ఇంటర్నెట్‌డెస్క్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ముఖచిత్రం ఉన్న అమెరికా పాస్‌పోర్టుల (US passports)ను త్వరలో విడుదల చేయాలని నిర్ణయించింది. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా పరిమితి సంఖ్యలో వీటిని రూపొందించనున్నట్లు తొలుత పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. తాజాగా యూఎస్ విదేశాంగశాఖ దీన్ని ధ్రువీకరించింది. ‘అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలు జులైలో జరగనున్నాయి. ఈ చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన యూఎస్ పాస్‌పోర్టులు విడుదల చేసేందుకు విదేశాంగ శాఖ సన్నద్ధమవుతుంది.
ఇవి పరిమిత సంఖ్యలో ఉండనున్నాయి’ అని విదేశాంగశాఖ ప్రతినిధి టామీ పిగాట్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పాస్‌పోర్టులకు ఎలాంటి అదనపు రుసుము ఉండదని విదేశాంగ వర్గాలు వెల్లడించాయి. పాస్‌పోర్టులు విడుదల చేయనున్న విషయాన్ని వైట్‌హౌస్ కూడా ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా అది పంచుకుంది. అందులో స్వాతంత్ర్య ప్రకటన పత్రంపై ట్రంప్ ఫొటో ఉండగా.. దాని కింద బంగారు రంగులో ఆయన సంతకం ఉంది. మరొక దానిలో యూఎస్ వ్యవస్థాపక పితామహుల చరిత్రాత్మక ఫొటో ఉంది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పతనం అంచున ఉన్నట్లు ఇరాన్ చెప్పింది: ట్రంప్ అధికారంలో ఉన్న నాయకుల ఫొటోలతో పాస్‌పోర్టులు రూపొందించడం చాలా అరుదు.
అనేక దేశాలు చారిత్రక దృశ్యాలు, ప్రకృతి చిత్రాలను ముద్రించేందుకు ప్రాధాన్యం ఇస్తాయి. ప్రస్తుతం యూఎస్ పాస్‌పోర్టులపై చరిత్రలోని ముఖ్య ఘట్టాలు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వంటి చారిత్రక ప్రదేశాలు ముద్రించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చిత్రంతో పరిమితి సంఖ్యలో పలు పాస్‌పోర్టులను రూపొందించాలనుకోవడం గమనార్హం. కాగా.. 250 స్వాతంత్ర్య వేడుకలకు గుర్తుగా ట్రంప్ ముఖచిత్రంతో స్మారక నాణెం రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ట్రంప్ సంతకం ఉన్న కరెన్సీ నోట్లను విడుదల చేయనున్నట్లు ట్రెజరీశాఖ ప్రకటించింది. దీంతో ఆ దేశ కరెన్సీ నోట్లపై సంతకం చేయబోయే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు.