Select Location
All Locations
State
Region
City / District
LPG Price | సామాన్యుడిపైకి గ్యాస్‌ మిస్సైల్‌.. వాణిజ్య ఎల్‌పీజీ ధర 5 నెలల్లో రూ.1,491 పెంపు

LPG Price | సామాన్యుడిపైకి గ్యాస్‌ మిస్సైల్‌.. వాణిజ్య ఎల్‌పీజీ ధర 5 నెలల్లో రూ.1,491 పెంపు

LPG Price | న్యూఢిల్లీ, మే 1: కార్మిక దినోత్సవం రోజున ప్రజలకు కేంద్రంలోని మోదీ సర్కార్‌ ఊహించని గిఫ్ట్‌ ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ప్రజలపై ఎటువంటి ఇంధన భారం మోపబోమని ఐదు రాష్ర్టాల ఎన్నికలకు ముందు పదేపదే హామీ ఇచ్చిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్లేట్‌ ఫిరాయించింది. ప్రజలపై గ్యాస్‌ పిడుగు వేసింది.

దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు టిఫిన్‌ సెంటర్లు ఉపయోగించే వాణిజ్య సిలిండర్‌పై రికార్డు స్థాయిలో మోయలేని భారం మోపింది. 19 కిలోల సిలిండర్‌పై దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేసారి రూ.993 పెంచేసింది. దీంతో ఢిల్లీలో దాని ధర రూ. 3,071.50కి చేరింది. అలాగే 5 కిలోల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్ల ధరలను ఒక్కో బాటిల్‌కు రూ. 549 నుంచి రూ. 810.50కి పెంచింది. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌ (డొమెస్టిక్‌ ఎల్‌పీజీ) ధర ప్రస్తుతం రూ. 913 కాగా, 5 కిలోల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్‌ ధర దానికంటే కొంచెం తక్కువగా ఉంది. అలాగే టెలికం సిగ్నల్‌ టవర్లు వంటి పారిశ్రామిక వినియోగదారులు వాడే బల్క్‌ డీజిల్‌ ధర లీటరుకు రూ. 137 నుంచి రూ. 149కి పెరిగింది. పెట్రోల్‌ పంపుల వద్ద లభించే లీటరు డీజిల్‌ ధర రూ. 87.62తో పోలిస్తే ఈ ధరలు ఎక్కువ. అంతర్జాతీయ విమానయాన సంస్థల జెట్‌ ఇంధనం ధరను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది.

వాణిజ్య ఎల్‌పీజీ ధర గడచిన 5 నెలల్లో రికార్డు స్థాయిలో రూ. 1,491 పెరిగింది. మార్చి 1 రూ. 28 పెంచగా మార్చి 7న రూ. 114.5 పెంచారు. తాజాగా రికార్డు స్థాయిలో రూ. 993 పెంచుతున్నట్లు ప్రభుత్వ అధీనంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ శుక్రవారం ప్రకటించింది. ఈ పెంపు వల్ల దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, చిన్న టిఫిన్‌ సెంటర్ల నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం నేరుగా వినియోగదారుడిపై పడే అవకాశం అధికంగా ఉంది. కాగా , విమానయాన సంస్థలు, వినియోగదారులను కాపాడేందుకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెరుగుతున్న ప్రపంచ ఇంధన ధరల భారాన్ని భరించాలని నిర్ణయించుకున్నాయని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) తెలిపింది. పెట్రోల్‌, డీజిల్‌, గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల రిటైల్‌ ధరలు స్థిరంగా ఉండగా అంతర్జాతీయ ధరల అస్థిరత నుండి వినియోగదారులను రక్షించడం, సాధారణ ప్రజలను ప్రభావితం చేసే కీలక ఇంధనాల ధరలలో ఎటువంటి సవరణ జరగలేదని ఐఓసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముడి సరుకుల ఖర్చుల ఆధారంగా ప్రతి నెలా ఒకటో తేదీన ఏటీఎఫ్‌ ధరలను సవరిస్తారు.

అంతర్జాతీయ విమానయాన సంస్థల జెట్‌ ఇంధన ధరలను 5 శాతం పెంచారు. వరుసగా ఇది రెండో నెల పెంపు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల ప్రకారం భారత్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయానికి నిలయమైన ఢిల్లీలో అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్‌ ధరలను కిలోలీటరుకు 76.55 డాలర్లు లేదా 5.33 శాతం పెంచి 511.86 డాలర్లకు చేర్చారు. మొత్తం వినియోగంలో దాదాపు 90 శాతం వాటా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరలు యథాతథంగా ఉన్నాయని ఐఓసీ తెలిపింది.


Sun News 1 hour ago
Home Flash News