తమిళనాట మరో సంచలన సర్వే
సాక్షి, చెన్నై: తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ మరో ఎంజీఆర్ అయ్యేనా అన్నది మరికొన్ని గంటల వ్యవధిలో తేలనుంది. ఈ నేపథ్యంలో మరో ఎగ్జిట్ పోల్‌లోనూ విజయ్‌కే అధికారం ఖాయం అని స్పష్టం కావడం చర్చనీయాంశమైంది. వివరాలు.. తమిళనాడులో మెజారిటీ సర్వే సంస్థలు అధికార డీఎంకేకు అనుకూలంగా ఫలితాల్ని ఇచ్చాయి.
అయితే యాక్సిస్ మై ఇండియా, మరికొన్ని స్థానిక చిన్న సంస్థలు, సామాజిక మాధ్యమాలో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం వైపే ప్రజలు మొగ్గు చూపారని స్పష్టం చేస్తున్నాయి. ఈ సమయంలో శనివారం మాజీ ఐపీఎస్ అధికారి పి. రవి బృందం నిర్వహించిన నియోజకవర్గాల వారీగా ఎగ్జిట్ పోల్ సర్వే ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పి. రవి బృందం తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమగ్రంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వే అంచనా ప్రకారం, విజయ్ నాయకత్వంలోని టీవీకే ఏకంగా 41 శాతం ఓట్లను సాధించి, 121 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత, ముఖ్యంగా 18–40 ఏళ్ల వయస్సు గల ఓటర్లు టీవీకే వైపు బలంగా నిలిచారని ఈ నివేదిక పేర్కొన్నారు.
సుమారు ఐదు దశాబ్దాలుగా తమిళనాడును పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల కంటే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ వైపు యువ ఓటర్లు ఎక్కువగా ఆకర్షితులయ్యారని ఈ సర్వే విశ్లేషించడం గమనార్హం. ఇక యాక్సిస్ మై ఇండియా విజయ్ పార్టీకి 98 నుండి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే తెలిపింది. మాజీ ఐపీఎస్ పి. రవి టీమ్ సర్వేతో పాటూ యాక్సిస్ మై ఇండియా సర్వేలు విజయ్‌కు అనుకూలంగా రావడంతో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అప్రమత్తమయ్యాయి. మే 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని తమ ఏజెంట్లు, అభ్యర్థులకు సూచించాయి.