Harish Rao | రేవంత్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు హంతక ప్రభుత్వమే : మాజీ మంత్రి హరీష్ రావు
Harish Rao | రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దిక్కుమాలిన చర్య అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. చరిత్రలో ఎన్నడూ ఇలాంటి నిషేధం విధించిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా అమ్మకాలపై నిషేధం మొదలైందన్నారు. యూరియా అమ్మకాలు నిలిపి వేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అమ్మకాలపై అనధికార బ్యాన్ ఎందుకు పెట్టారో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.
స్టాక్ ఉన్నా.. డీలర్లు, అగ్రో సెంటర్లు, సొసైటీల్లో రైతులకు యూరియా ఎందుకు ఇవ్వడం లేదు, యూరియా కోసం రైతులు తిరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. యూరియా అమ్మకాలు నిలిపివేయడంతో చెరకు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాల్సింది పోయి, ఎరువుల కష్టాలను మరింత ఎక్కువ చేసేలా రూపొందించిన యాప్ రైతుల పాలిట శాపంగామారిందన్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు ఇప్పుడు ఏకంగా యూరియా అమ్మకాలపై బ్యాన్ విధించడం దుర్మార్గం అన్నారు. రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నఅనధికారిక బ్యాన్.. ఒకవైపు పెరిగిన ఎరువుల ధరలు, మరోవైపు యూరియాపై ప్రభుత్వ అనధికారిక బ్యాన్ రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. యూరియా సరఫరాపై దృష్టి సారించడం మానేసి, యూరియా వినియోగం తగ్గించాలంటూ రైతులకు చెప్పడం, డబ్బులు వెచ్చించి ప్రచారం చేయడం హాస్యాస్పదం అన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో దారుణంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల ఒకవైపు రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటే ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తుండటం వారిని అవమానించడమే అన్నారు. రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్, బోనస్ చెల్లించడంలో ఫెయిల్, పంట బీమా పథకం అమలులో ఫెయిల్,రుణమాఫీ చేయడంలో ఫెయిల్ యూరియా సరఫరాలో ఫెయిల్,పంట కొనుగోళ్లు చేయడంలో ఫెయిల్,కొన్న పంటకు బోనస్ పైసలు ఇవ్వడంలో ఫెయిల్, వైఫ్యల్యాలను కవర్ చేసుకోవడానికి వారోత్సవాల పేరిట డ్రామా చేసినంత మాత్రాన రైతుల ఉసురు తీసుకుంటున్న పాపం రేవంత్ రెడ్డికి తగలకుండా పోదన్నారు. రైతు డిక్లరేషన్ పేరిట నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. రైతులు నిలదీతకు బయపడి అధికారులు రైతు వేదికల నుంచి పారిపోయే పరిస్థితి రావడం మీ పాలనా వైఫల్యానికి నిదర్శనం అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వలే నిరంతరం యూరియా అమ్మకాలు కొనసాగించాలని, అనధికారిక బ్యాన్ ను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.