ఆధ్యాత్మికం : గుళ్లు.. గోపురాలకు చందాలిస్తే పాపాలు పోతాయా? పురాణాల్లో ఏముందో తెలుసా..!
భారతీయ సాహిత్యంలో పురాణాలది అగ్రస్థానం. అందుకే 'పునర్నవీనం పురాణం' అన్నారు. పురాణాలను కాలాన్నిబట్టి సవీనంగా నిర్వచించుకునేందుకు, అన్వయించుకునేందుకు అవకాశం ఉన్నది. 'ఏది కర్తవ్యమో, ఏది కర్తవ్యమో కానిదో నిర్ధారించి, కర్తవ్యాన్ని నిర్వహించేందుకు ప్రేరణ నిచ్చేవని పురాణాలను నిర్వచించారు. వీటి మూలం మానవ జీవనమే. మానవ జీవనంలోని అన్ని పార్శ్వాలనూ పురాణాలు వర్ణించాయి.
ఏ పేరుతో పిలిచినా, ఈ సృష్టి ఆవిర్భావానికి ముందు ఉన్నది ఒకే ఒక్క శక్తి. దానిని మతాలు దేవుడు అన్నాయి. తాత్వికులు ఆత్మ అన్నారు. భౌతిక వాదులు శక్తి అన్నారు. వెరసి అదే దైవాత్మశక్తి. ఆ క్రమంలో వెలువడిందే దైవం అనే భావన. మూల చైతన్యానికి ఎవరిపై ప్రేమ, ద్వేషం కానీ లేదు. సమభావనతో చేసిన కర్మలకు ఫలితాన్నిస్తుంది.. భజించాడని, పూజించాడని అనుగ్రహించడం... లేదని ఆగ్రహించడం మూల చైతన్య లక్షణం కాదు. అయితే ప్రజలను క్రమశిక్షణలో పెట్టేందుకు సామాజిక మార్గ దర్శకులు ఆ చైతన్యానికి మహిమలు కల్పించి సాధారణ ప్రజానీకాన్ని ఆ వైపు మళ్ళించే ప్రయత్నం చేసారు.
సశాస్త్రీయమైనవి దేవాలయాలు. యంత్రాలు పెడుతూ మంత్రపూతమైన విగ్రహాన్ని ప్రతిష్టించి నిత్యపూజాదికాలు నిర్వహించడం వల్ల ఆ మంత్రోచ్ఛారణచే కలిగిన శక్తి ప్రకంపనలు ఆ పరిసరాలను పవిత్రం చేస్తాయి. శక్తివంతం చేస్తాయి. అందుకే నిత్యం ఒకే అంతరంలో ఉచ్ఛరించబడే శబ్ద తరంగాలను ప్రసరింపచేయడం ఆచారంగా మారింది. ఆ ప్రక్రియలో భాగంగా అర్చనాదులను ఏర్పాటు చేసారు. ఈ ప్రక్రియ అంతా సజావుగా జరిగేందుకు అవసరమైన యంత్రాంగం వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు ఈ వ్యవస్థ అంతా పాలకుల చేతుల్లో ఉండేది. కానీ, ఇప్పుడు ప్రజలే ఆ వ్యవస్థను నడపాల్సిన అగత్యం ఏర్పడింది.
పాపపుణ్యాలనేవి నిజానికి సాపేక్షమే. ఇతరులకు మంచి జరిగితే అది పుణ్యం అంటాం. చెడు జరిగితే అది పాపం అంటాం. సత్కార్యాలు చేసినప్పుడు పాపం పోవడం ఉండదు. చెడు చేస్తే పాపము రావడమూ ఉండదు. చేసిన కర్మకు ఫలితం ఉంటుంది. దేనికదే రెండూ అనుభవించాల్సిందే. జ్ఞానం వల్ల సమభావన కలిగి సమదృష్టితో సకల జీవులను ఆదరించిన వారికి, తనకున్న దానిని పంచుకున్న వారికి సత్ఫలితాలు వస్తాయి. అన్నింటినీ కర్మ ఫలితంతో సహా త్యాగం చేయగలిగిన వారికి జీవస్ముక్తి లభిస్తుంది.