Select Location
All Locations
State
Region
City / District
ఐపీఎల్‌ వీఐపీ టికెట్ల దందాలో టీడీపీ కార్యకర్తలు

ఐపీఎల్‌ వీఐపీ టికెట్ల దందాలో టీడీపీ కార్యకర్తలు

కందుకూరు: హైదరాబాద్‌లో ఐపీఎల్‌ క్రికెట్‌ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు పట్టుబడటం స్థానికంగా సంచలనం కలిగించింది. క్రికెట్‌ బెట్టింగ్, పేకాట, మోసాలు చేయడంలో ఆరితేరిన అశోక్‌చౌదరి బృందం ఈ టికెట్లు అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడంతో వారి ఆగడాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఘట్టమనేని అశోక్‌చౌదరి ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ కీలక కార్యకర్త. ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల ఆసరాగా ఈ ముఠా భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

పలుకూరుకు చెందిన అశోక్‌చౌదరి, కంకణాల దినేష్, సింగమనేని వేణుమాధవ్‌ మిత్రులు. గ్రామంలో టీడీపీ కీలక కార్యకర్తలు. కందుకూరు ప్రాంతంలో టీడీపీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా హడావుడి అంతా అశోక్‌చౌదరిదే. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉండడంతో వీరు సంపాదనకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. తమకు ఎదురే లేదన్నట్లు క్రికెట్‌ బెట్టింగ్‌ దందాను నడిపించడంతోపాటు వీఐపీల పేరుతో భారీ మోసాలకు పాల్పడసాగారు. దీన్లో భాగంగా తమిళనాడుకు చెందిన ఆశిష్, సెంథిల్, తన్సిల్‌తో కలిసి వీరు ముఠాగా ఏర్పడ్డారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించి వీఐపీ కాంప్లిమెంటరీ టికెట్లు సంపాదించి వాటిని బ్లాక్‌లో మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీనికిగాను గవర్నర్‌లు, మంత్రులు, న్యాయమూర్తుల పేరుతో వివిధ రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్లకు నకిలీ లెటర్‌హెడ్‌లను పంపి అక్కడి నుంచి ఐపీఎల్‌ కాంప్లిమెంటరీ టికెట్లు పొందేవారు. 

అలా పొందిన టికెట్లను బ్లాక్‌మార్కెట్‌లో ఒక్కొక్కటి రూ.22 వేలకు అమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. వీఐపీ లెటర్‌హెడ్‌లతో టికెట్లు పొందుతున్న ఈ ముఠా వ్యవహారంపై అనుమానం రావడంతో హెచ్‌సీఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఉప్పల్‌ పోలీసులు ఉప్పల్‌ స్టేడియం వద్ద బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తుండగా అశోక్‌చౌదరి, దినేష్, వేణుమాధవ్‌లను రెండు రోజుల కిందట అరెస్టు చేశారు. వీరంతా పలుకూరుకు చెందినవారు కావడంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో వీరి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ముఠాలో కీలక సూత్రధారి అశోక్‌చౌదరి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. గ్రామంలో దురుసుగా ప్రవర్తించడం, టీడీపీ కార్యక్రమాల సందర్భంగా బైక్‌లతో హంగామా చేయడం పరిపాటి అని చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు, వీఐపీలతో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటుంటాడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, పలువురు టీడీపీ ముఖ్యులు, ఐసీసీ చైర్మన్‌ జైషాతో దిగిన ఫొటోలను పెట్టుకున్నాడు. ఇలా ఫొటోలతో తననుతాను ప్రమోట్‌ చేసుకుంటూ క్రికెట్‌ బెట్టింగ్‌ దందా, టికెట్ల బ్లాక్‌మార్కెట్‌ ముఠా నడిపిస్తున్నాడు.


Sakshi 2 days ago
Home Flash News