కేటీఆర్ అబద్దాల ప్రచారం చేయడం మానుకో : మంత్రి సీతక్క
ములుగు, ఏటూరునాగారం, వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ దుర్మార్గపు, అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని, వాస్తవాలు మాట్లాడటం నేర్చుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హితవు పలికారు. పదేండ్లలో నాలుగు సార్లు రూ.లక్ష రుణమాఫీ చేసేందుకు నానా తంటాలు పడ్డారని, కాంగ్రెస్ పాలనలో ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. పదేళ్ల పాలనలో ఏ ఒక్క రోజు కూడా రైతుల వద్దకు రాని బీఆర్ఎస్నాయకులకు ఈ రోజు రైతులు గుర్తురావడం హాస్యాస్పదమని విమర్శించారు. బుధవారం ములుగు ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మంత్రి మాట్లాడుతూ హనుమకొండ రైతు సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చావును కోరుకునే కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం అహంకారానికి నిదర్శనమన్నారు. అంతకుముందు మంత్రి ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల, కొండాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రజాదర్భార్ కార్యక్రమాలు నిర్వహించగా, కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పోతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అదేవిధంగా రూ.16.50కోట్లతో నిర్మిస్తున్న కొండాయి బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.
గోవిందరావుపేల మార్కెట్ యార్డులో రైతు సదస్సులో పాల్గొన్నారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో, ములుగు గట్టమ్మ సమీపంలో నిర్మించిన 11కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించారు. గ్రామాల్లో నిరంతర విద్యుత్ వెలుగులు అందించడమే లక్ష్యంగా జిల్లాలో రూ.41కోట్ల నిధులతో 12 విద్యుత్ ఉపకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కాగా, జిల్లాలోని అన్ని మండలాల ఎంసీసీ కేంద్రాలకు స్వచ్ఛభారత్ మిషన్ నిధుల ద్వారా 10 కంప్యూటర్లు, స్కానర్, ప్రింటర్లను, ఏటూరు నాగారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 11మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. టెన్త్లో జిల్లా టాపర్ కోరం కున్నత్ కృష్ణను సన్మానించారు.