'ఫైళ్లు వద్దు.. రిజల్ట్స్ కావాలి'..కలెక్టర్లకు చంద్రబాబు డెడ్ లైన్!
అమరావతి: ప్రభుత్వ సేవలు మరియు సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతను జోడించి, వినూత్న పద్ధతుల ద్వారా ప్రజల్లో 90 శాతానికి పైగా సంతృప్తి స్థాయిని సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 28 జిల్లాలను ఇన్నోవేషన్ హబ్‌లుగా మార్చి అభివృద్ధిలో ఒకరితో ఒకరు పోటీ పడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 28 అత్యుత్తమ విధానాల వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఏపీపై నమ్మకం పెరిగిందని, గత 23 నెలల్లో సుమారు రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. వీటి ద్వారా 24 లక్షల మందికి ఉపాధి లభించనుందని సీఎం వివరించారు.
విశాఖను టెక్నాలజీ హబ్‌గా, అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్న ఆయన, డిసెంబర్ నాటికి అన్ని రకాల ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ వ్యవస్థలో ఎక్కడా తప్పులు లేకుండా 2027 మార్చి నాటికి రికార్డులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని లక్ష్యంగా విధించారు. కేవలం కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల స్పందనను తెలుసుకోవాలని సూచించారు. మంత్రులు, కలెక్టర్ల పనితీరు ఆధారంగా వారికి రేటింగ్స్ ఇస్తామని స్పష్టం చేస్తూ.. పాలనలో ఫైళ్ల కదలిక కంటే వేగవంతమైన ఫలితాల సాధనే ముఖ్యమని అధికారులకు హితబోధ చేశారు. ప్రభుత్వం సాధించిన విజయాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలని సీఎం సూచించారు.