Suvendu Adhikari | పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి..? బెంగాల్ బీజేపీ నేతలతో నేడు అమిత్ షా భేటీ
Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్ సీఎం ఎంపిక విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. బెంగాల్ సీఎంగా బీజేపీ అధిష్టానం ఎవరిని నియమిస్తుంది అనే ఉత్కంఠకు శుక్రవారం సాయంత్రం తెరపడే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బెంగాల్ నూతన సీఎంగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారిని అధిష్టానం నియమించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు బెంగాల్ బీజేపీ లెజిస్లేటర్ పార్టీ సమావేశం జరగనుంది.
కోల్‌కతాలో జరిగే ఈ సమావేశంలో లెజిస్లేటివ్ పార్టీ నేతను ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియను నిర్వహించేందు కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నారు. వీరు బెంగాల్ సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు వంటి అంశాల్లో కేంద్ర పరిశీలకులుగా వ్యవహరిస్తారు. సాయంత్రం జరిగే సమావేశంలో ఎమ్మెల్యేలతో చర్చించి, నూతన సీఎంను ఎన్నుకుంటారు. సీఎం పదవి కోసం సువేందు అధికారి, దిలీప్ ఘోష్, శామిక్ భట్టాచార్య, అగ్నిమిత్ర పాల్, రూపా గంగూలి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే, బీజేపీ పెద్దలు, పార్టీ నేతలు మాత్రం సువేందు అధికారి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సీఎం పదవికి రాజీనామా చేయని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గురువారం సాయంత్రం పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్‌ఎన్ రవి రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. తాజా సమాచారం ప్రకారం.. మే 9న బెంగాల్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది.,