Select Location
All Locations
State
Region
City / District
బ్యాంకింగ్ సేవలకు NRIలు ఇండియన్ సిమ్ వాడొచ్చా? ఎలాంటి జాగ్రత్తలు అవసరం?

బ్యాంకింగ్ సేవలకు NRIలు ఇండియన్ సిమ్ వాడొచ్చా? ఎలాంటి జాగ్రత్తలు అవసరం?

భారత్ వదిలి విదేశాలకు వెళ్లే NRIలు తమ వెంట తీసుకెళ్లాల్సిన అత్యంత ముఖ్యమైన వస్తువుల్లో 'ఇండియన్ సిమ్ కార్డ్' ఒకటి. కేవలం కుటుంబ సభ్యులతో మాట్లాడటానికే కాకుండా.. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థతో ముడిపడి ఉన్న ఆర్థిక లావాదేవీలను సజావుగా నిర్వహించుకోవడానికి ఇది కీలకంగా మారింది. చాలామంది ఎన్ఆర్ఐలు తమ విదేశీ ప్రయాణం మొదలైన కొత్తలో దీని ప్రాముఖ్యతను గుర్తించరు. అయితే కీలకమైన బ్యాంకింగ్ లావాదేవీ చేసే సమయంలో OTP రాకపోతే పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు మరి.

బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ దేశీయ మొబైల్ నంబర్ల చుట్టూనే లింక్ చేయబడ్డాయి. ఇన్వెస్ట్‌మెంట్స్, యూపీఐ పేమెంట్స్, కేవైసీ అప్‌డేట్ వంటి పనులకు ఇండియన్ మొబైల్ నంబర్ ఉండటం ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఐటీ రిటర్నులు దాఖలు చేయడం, డిజిలాకర్, ఈపీఎఫ్ఓ పోర్టల్స్‌ను యాక్సెస్ చేయడం వంటి ప్రభుత్వ సంబంధిత సేవలకు కూడా మెుబైల్ నంబర్ తప్పనిసరిగా మారిపోయింది నేటి కాలంలో.

ఇండియన్ సిమ్ కార్డును విదేశాల్లో యాక్టివ్‌గా ఉంచడం అంత ఈజీ కాదు. ఇంటర్నేషనల్ రోమింగ్ ఛార్జీలు అధికంగా ఉండటం ఒక సమస్య అయితే, ఎక్కువ కాలం వాడకపోతే సిమ్ కార్డులు డీయాక్టివేట్ అయ్యే ప్రమాదం మరొకటి. ఒకవేళ సిమ్ కార్డు పనిచేయకపోతే, ఆ నంబర్‌తో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేయడం కష్టమవుతుంది. అలాగే విదేశీ నెట్‌వర్క్ క్యారియర్‌ల ద్వారా మెసేజ్‌లు అందడంలో ఆలస్యం జరగడం వల్ల సమయానికి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయ్యే ప్రమాదమూ ఉంది.

ప్రస్తుతం కొన్ని బ్యాంకులు అంతర్జాతీయ మొబైల్ నంబర్లను కూడా అనుమతిస్తున్నాయి. ముఖ్యంగా NRE, NRO అకౌంట్ హోల్డర్లకు ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తోంది. అయితే ఇది అన్ని రకాల సేవలకూ వర్తించకపోవచ్చు. దీనికి తోడు, ఫిజికల్ సిమ్ కార్డు కంటే e-SIM వాడటం ఈజీ అని కొందరు భావించినప్పటికీ, ఫోన్ పోయినప్పుడు లేదా మార్చినప్పుడు ఈ-సిమ్ తిరిగి పొందే ప్రక్రియ కొంత క్లిష్టంగా ఉంటుంది. యాప్ అథెంటికేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటివి వాడుతూ.. ఇండియన్ సిమ్ కార్డును ఒక నమ్మకమైన బ్యాకప్‌గా ఉంచుకోవడం ఎన్ఆర్ఐలకు బెస్ట్ చాయిస్. సో విదేశాల్లో ఉన్న వారు తమ సిమ్ కార్డును కాపాడుకోవటం చాలా ముఖ్యమని అస్సలు మర్చిపోకూడదు.


V6 News 54 minutes ago
Home Flash News