బిస్కెట్ ప్యాకెట్ల రేట్లు పెంచుతున్న బ్రిటానియా.. గల్ఫ్ ఫ్యాక్టరీల్లో ప్రొడక్షన్ నిలిపివేత
దేశంలోనే అతిపెద్ద బిస్కెట్ తయారీ సంస్థ అయిన బ్రిటానియా ఉత్పత్తుల రేట్లు పెంచాలని డిసైడ్ అయ్యింది. ప్రస్తుత క్వార్టర్‌లో కొన్ని ఉత్పత్తులపై ధరల పెంపుతో పాటు వాటి బరువు తగ్గింపును అమలు చేయాలని నిర్ణయించింది. పామాయిల్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఇంధనం, రవాణా ఖర్చులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ ఎండీ, సీఈఓ రక్షిత్ హర్గావే వెల్లడించారు.
ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా సరఫరా గొలుసుపై ప్రభావం పడింది. దీంతో రవాణా ఖర్చులు పెరిగాయి. ఈ భారాన్ని తట్టుకోవడానికి, కంపెనీ లాభాల మార్జిన్లను కాపాడుకోవడానికి ధరల పెంపు అనివార్యమైందని కంపెనీ స్పష్టం చేసింది. ముఖ్యంగా రూ.10 కంటే ఎక్కువ ధర కలిగిన ప్యాకెట్లపై ధరల పెంపు ఉండనుంది. అలాగే తక్కువ ధర పాయింట్ల వద్ద ఉన్న బిస్కెట్ ప్యాకెట్ల బరువును తగ్గించడం ద్వారా ఖర్చులను సమతుల్యం చేయాలని బ్రిటానియా భావిస్తోంది.
గత త్రైమాసికంలో బ్రిటానియా నికర లాభం 21 శాతం పెరిగినప్పటికీ.. ఆదాయ వృద్ధి మాత్రం 7.1 శాతంతో రూ.4వేల 686 కోట్లకు పరిమితమైంది. ఇది విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా ఉండటంతో స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు సుమారు 4 శాతం పైగా పతనమయ్యాయి. మార్జిన్లు తగ్గడంపై ఇన్వెస్టర్లు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బిస్కెట్ ఉత్పత్తుల ధరలు స్వల్పంగా పెరిగినా మార్కెట్లో డిమాండ్ బలంగానే ఉంటుందని హర్గావే ధీమా వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ వ్యాపారంపై కూడా యుద్ధ ప్రభావం గట్టిగానే పడింది. హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా షిప్స్ లభ్యత తగ్గి ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఉత్తర అమెరికా మార్కెట్లకు సరఫరా చేయడానికి ఓమన్‌లోని ప్లాంట్ల నుండి తయారీని తిరిగి ముంద్రా ప్లాంట్లకు మార్చినట్లు బ్రిటానియా తెలిపింది. ఇక దేశీయంగా జీఎస్టీ తగ్గింపులు ప్రకటించిన సమయంలో వచ్చిన డ్యూయల్ ప్రైసింగ్ వల్ల గ్రామీణ, హోల్‌సేల్ మార్కెట్లలో కొంత వృద్ధి తగ్గినప్పటికీ.. అర్భన్, ఈ-కామర్స్ విభాగాల్లో వృద్ధి బాగుందని బ్రిటానియా వివరించింది. ముడిసరుకు ధరల ఒడిదుడుకుల నుండి రక్షణ పొందేందుకు కంపెనీ ఇప్పటికే 5 నెలలకు సరిపడా పామాయిల్ కాంట్రాక్టులను ముందే కుదుర్చుకుందట.