Sanjeev Arora: మంత్రి సంజీవ్ అరోరాను అరెస్టు చేసిన ఈడీ
చండీఘడ్: పంజాబ్ పరిశ్రమల, విద్యుత్తు శాఖ మంత్రి సంజీవ్ ఆరోరా(Sanjeev Arora) నివాసంపై ఇవాళ ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆ తర్వాత సంజీవ్ అరోరాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చండీఘడ్‌లోని సెక్టార్ 2లో ఉన్న నివాసంలో ఆయన్ను అరెస్టు చేశారు. ఢిల్లీ, గురుగ్రామ్, చండీఘ్‌తో పాటు హంప్టన్ స్కై రియాల్టీ లిమిటెండ్ సంస్థ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు. ఫేక్ జీఎస్టీ కొనుగోళ్లు చేసినట్లు సంజీవ్ అరోరా కంపెనీపై ఫిర్యాదులు ఉన్నాయి. సుమారు వంద కోట్ల ఖరీదైన మొబైల్ ఫోన్లు ఖరీదు చేసినట్లు ఉన్నది. దుబాయ్ నుంచి భారత్‌కు అక్రమ రీతిలో ఫండ్స్ తరలించారు. ఫేక్ జీఎస్టీ బిల్లులు సృష్టించారు.
మంత్రి సంజీవ్ అరోరా ఇంటిపై దాడులు చేయడం ఈ ఏడాది ఇది మూడోసారి. మనీల్యాండరింగ్ కేసులో దర్యాప్తు జరుగుతున్నది. ఉదయం 5 గంటలకు చండీఘడ్‌లోని మంత్రి ఇంటికి ఈడీ చేరుకున్నది. ఆపరేషన్ సమయంలో మంత్రి నివాసం ముందు ఈడీ అధికారులకు చెందిన 8 వాహనాలను నిలిపారు. ఏప్రిల్‌లో ఓ సారి ఈడీ రెయిడ్ నిర్వహించింది. ఫెమా చట్టం ఉల్లంఘన కింద ఓ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు ఏజెన్సీలకు సహకరించనున్నట్లు ఆయన గతంలో చెప్పారు.
పరిశ్రమలకు కేటాయించిన భూములను రెసిడెన్షియల్ ప్రాజెక్టుల కోసం వాడుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుతో లింకున్న మనీల్యాండింగ్ అంశంపై సంజీవ్ అరోరాను ప్రశ్నించారు. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్ లాంటి ఆప్ నేతలు అరోరాకు అండగా ఉన్నా.. ఈడీ మాత్రం తన పని తాను చేసుకుపోయింది.