Illegal Sand Transport | రాఘవ కన్‌స్ట్రక్షన్ తరలిస్తున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే
మహబూబ్‌నగర్ : జిల్లాలోని మాగనూరు మండల కేంద్రం పెద్ద వాగు నుంచి రాఘవ కన్‌స్ట్రక్షన్ ( Raghava Construction ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా ( Illegal Sand Transport ) ను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) అడ్డుకున్నారు.
నారాయణపేట- మక్తల్- కొడంగల్ ఎత్తిపోతల్లో భాగంగా కొనసాగుతున్న పైప్‌లైన్ , ట్యాంకు నిర్మాణం పనులకు మాగనూరు వాగు నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. శనివారం కూడా హిటాచితో ఇసుకను తరలించేందుకు పనులను ప్రారంభించగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వాగు వద్దకు చేరుకొని అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.
అనుమతులు లేకుండా పెద్దవాగు నుంచి ఇసుకను తరలిస్తే భవిష్యత్తులో గ్రామస్తులకు తాగునీరు, సాగు నీటి ఇబ్బందులు తలెత్తుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివారు రైతులకు ఇబ్బంది కలిగిస్తే ఎంత మాత్రం సహించబోమని హెచ్చరించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలకు అధికారులు, పోలీసులు సహకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.