Donald Trump: అమోదయోగ్యంగా లేదు.. ఇరాన్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) తిరస్కరించారు. ఆ ప్రతిపాదన పూర్తిగా ఆమోదయోగ్యం లేదన్నారు. కానీ ఆ ప్రతిపాదనలకు చెందిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇక రిపబ్లికన్ పార్టీ నేత ఒకరు .. ఇరాన్‌పై మళ్లీ మిలిటరీ చర్య చేపట్టాలని సూచించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌తో వార్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధానికి ముగింపు పలికే సందర్భం వచ్చినట్లు ఆదివారం భావించారు. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్ చేసిన ప్రతిపాదనలను తిరస్కరించారు. ఇరానీ ప్రతినిధులు పంపిన ప్రతిపాదనను ఇప్పుడే చదివాను, అవి నాకు నచ్చ లేదు, అవి ఆమోదయోగ్యంగా లేవు అని ట్రంప్ తన ట్రుత్ సోషల్ అకౌంట్‌లో రాశారు.
గడిచిన 50 ఏళ్ల నుంచి అమెరికాతో టెహ్రాన్ ఆటలాడుతోందని ట్రంప్ విమర్శించారు. ఇక వాళ్లు నవ్వుకునే రోజులు ముగిసాయన్నారు. వాళ్లు పంపిన లెటర్ నాకు నచ్చలేదు, అది సరిగా లేదు, వాళ్ల రెస్పాన్స్ బాగాలేదన్నారు. గత 47 ఏళ్లుగా అనేక దేశాలను ఇరాన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆరోపించారు. ఇరాన్‌పై మిలిటరీ చర్యకు ట్రంప్ ప్లాన్ చేయాలని రిపబ్లికన్ సేనేటర్ లిండ్సే గ్రహం తెలిపారు. దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతర్జాతీయ షిప్పింగ్‌పై ఇరాన్ నిత్యం దాడులకు పాల్పుడుతోందని, పశ్చిమాసియా మద్దతు దేశాలపై కూడా దాడులు చేస్తోందని, అమెరికా ప్రతిపాదనను ఆ దేశం వ్యతిరేకించిందని, ఈ సందర్భంలో అమెరికా తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వస్తుందని గ్రహం తెలిపారు.