4 వేల మంది ఉద్యోగులను పీకేసిన Cisco.. ఏఐ వల్ల తప్పట్లేదన్న సీఈఓ
టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ పరంపర ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. మెటా, అమెజాన్, ఒరాకిల్ వంటి దిగ్గజాల బాటలోనే నెట్‌వర్కింగ్ జెయింట్ సిస్కో కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకవైపు రికార్డు స్థాయి లాభాలు ఉన్నప్పటికీ.. మరోవైపు వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమవ్వడం కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. AI యుగంలో నెగ్గుకురావాలంటే కఠిన నిర్ణయాలు తప్పవంటూ సిస్కో సీఈఓ చక్ రాబిన్స్ పంపిన మెయిల్ ఇప్పుడు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
సిస్కో తాజాగా ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో ఏకంగా 15.8 బిలియన్ డాలర్ల రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 12 శాతం వృద్ధి. ఇంతటి భారీ లాభాల్లో ఉన్న కంపెనీ.. ఉన్నట్టుండి ఉద్యోగులను తొలగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా సుమారు 4వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చక్ రాబిన్స్ ప్రకటించారు. మే 14 నుంచే ఎఫెక్ట్ అయిన ఉద్యోగులకు కంపెనీ సమాచారం అందించడం స్టార్ట్ చేసింది.
సిస్కో ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భవిష్యత్తు అంతా AI మయం కానుందని.. ఆ రంగంలో పెట్టుబడులు పెంచాలంటే ఖర్చులను తగ్గించుకోక తప్పదని సిస్కో భావిస్తోంది. సిలికాన్, ఆప్టిక్స్, సెక్యూరిటీ వంటి విభాగాల్లో పెట్టుబడులు పెంచుతూనే.. AI వాడకాన్ని కంపెనీలో పెంచాలని ప్లాన్ చేస్తోంది. అంటే మనుషులు చేసే పనిని AIతో రీప్లేస్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయని స్పష్టమవుతోంది. క్లౌడ్‌ఫ్లేర్ వంటి కంపెనీలు కూడా ఇదే బాటలో ఉండటం గమనార్హం.
ఉద్యోగం పోగొట్టుకున్న వారికి సిస్కో కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తోంది. బాధితులకు సెటిల్మెంట్ కింద భారీ మొత్తంలో పరిహారం కింద రూ.9వేల 500 కోట్ల వరకూ ఖర్చు చేయనుంది. వెళ్లిపోయే ఉద్యుగోలకు.. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రొ-రేటెడ్ బోనస్ చెల్లింపులు. ఒక ఏడాది పాటు సిస్కో U కోర్సులు, సర్టిఫికేషన్లు ఉచితంగా పొందే అవకాశం అందిస్తోంది. అలాగే వేరే కంపెనీలో కొత్త జాబ్ లేదా తమ సంస్థలోనే ఇతర డిపార్ట్మెంట్లలో అవకాశాల కోసం ప్లేస్‌మెంట్ సర్వీస్ ఆఫర్ చేస్తోంది.
సిస్కో తీసుకున్న ఈ లేఆఫ్ నిర్ణయం తర్వాత కంపెనీ షేర్లు ఏకంగా 17 శాతం పెరిగాయి. అంటే ఉద్యోగుల తొలగింపును ఇన్వెస్టర్లు స్వాగతిస్తున్నారని అర్థం. ఏది ఏమైనా లాభాల్లో ఉండి కూడా లేఆఫ్స్ ప్రకటించడం అనేది టెక్ రంగంలో మారుతున్న వింత పోకడకు నిదర్శనం. AI వేవ్ లో నిలబడాలంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తమను తాము నిరంతరం అప్‌డేట్ చేసుకోవాల్సిందేనని ప్రస్తుత పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి.