Select Location
All Locations
State
Region
City / District
ఇరికించిన బడేభాయ్‌.. ప్రధాని మోదీ వ్యూహంలో రేవంత్‌రెడ్డి గింగిరాలు

ఇరికించిన బడేభాయ్‌.. ప్రధాని మోదీ వ్యూహంలో రేవంత్‌రెడ్డి గింగిరాలు

తనతో కలువాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రధాని మోదీ ఆహ్వానించి, అంటించిన నిప్పు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ అధిష్ఠానంలో పెద్ద మంటే రాజేసింది. వివిధ మార్గాల ద్వారా సమాచారం తెప్పించుకున్న ఢిల్లీ పెద్దలు రేవంత్‌రెడ్డి తీరుపై అగ్గిమీద గుగ్గిలమయ్యారట. బీజేపీతో సంబంధాలు, కేంద్రమంత్రులతో సాన్నిహిత్యం, గత పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో వచ్చిన ఆరోపణలు వంటివన్నీ అధిష్ఠానం చేతికి చేరాయని సమాచారం. ఈ విషయం తేల్చేయాలని కాంగ్రెస్‌ పెద్దలు ఆలోచిస్తున్నట్టు రేవంత్‌ రెడ్డికి సమాచారం అందిందట. దీంతో ఆయన హఠాత్తుగా రాహుల్‌ రాగం అందుకున్నారు.

హైదరాబాద్‌, మే15 (నమస్తే తెలంగాణ) : ‘రేవంత్‌రెడ్డికి ఒకటి చెప్తున్న. కేంద్ర ప్రభుత్వం గతంలో గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చిందో, అన్ని నిధులు మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. కానీ అలా చేస్తే ప్రస్తుతం మీకు అందుతున్నది సగమై పోతుంది. మీరు ఎక్కడికి చేరుకోవాలని అనుకుంటున్నారో.. అక్కడికి చేరుకోలేరు. అందుకే నాతో కలువండి’.. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు. ‘గాంధీ కుటుంబానికి దేశం పట్ల విశ్వాసం ఉన్నది. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో నాకు చాలా చొరవ ఉన్నది. నేను నా గీత దాటను. 2024 నుంచి 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసి, ఆయన ఇచ్చిన చైర్‌లో నేను కూర్చుంటా’.. 

పరేడ్‌ గ్రౌండ్‌లో మోదీ ప్రసంగం కంటే కూడా ‘నాతో కలువండి’ అని చేసిన వ్యాఖ్యల మీదే అటు ప్రధాన మీడియా, ఇటు సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. మోదీ ఆ మాట ఎందుకు అన్నారు? ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఆనాడు మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం గుజరాత్‌కు ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదని చెప్పదలుచుకున్నారా? లేకవేరే ఉద్దేశంతో అన్నారా? అని చర్చలు జరుగుతున్నాయి. రేవంత్‌రెడ్డిని బీజేపీలో చేరాలని మోదీ పరోక్షంగా ఆహ్వానించారని చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానానికి, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు రేవంత్‌రెడ్డి మీద అనుమానం మొదలైంది. ఆయన గతంలో చంద్రబాబుతో అంటకాగి, తెలంగాణలో టీడీపీ పుట్టిముంచి, కాంగ్రెస్‌లోకి జంప్‌ అయ్యారని, ఇదే తరహాలో మోదీ ఇచ్చిన ఆఫర్‌తో రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీని ముంచి బీజేపీ కండువా కప్పుకొంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీలో 70 శాతం మంది కార్యకర్తలు ఇదే విషయాన్ని నమ్ముతున్నట్టు రేవంత్‌రెడ్డి అంతర్గతంగా చేయించుకున్న సర్వేలో తేలినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రేవంత్‌రెడ్డిపై ఈ స్థాయిలో అపనమ్మకం ఏర్పడటానికి బలమైన కారణాలే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రేవంత్‌రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని ఏబీవీపీలో ప్రారంభించారని, రాష్ట్రంలో ఇప్పటికీ బీజేపీ ఎజెండానే అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీయేతర పాలిత రాష్ర్టాల్లో ప్రభుత్వ స్థలాలు, పాఠశాలల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలను నిషేధించారని, తమిళనాడులో స్టాలిన్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు రూట్‌ మార్చ్‌ మీద ఆంక్షలు పెట్టిందని, కానీ తెలంగాణలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశాలను పక్కన పెట్టి బీజేపీ ఎజెండాను పక్కాగా అమలు చేశారని పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. సీఎం ఇప్పటివరకు 69 సార్లు ఢిల్లీకి వెళ్లినా అనేక సందర్భాల్లో ఏఐసీసీ అగ్రనేతలు ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని, కానీ ఆయన అడిగిన వెంటనే కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్‌ దొరికిందని చెప్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని, దీంతో కనీసం 6 సీట్లలో ఓడిపోయామని ఢిల్లీ పెద్దలు భావించారు. దీనిపై విచారణ సైతం జరిపించిన సంగతి తెలిసిందే. రేవంత్‌రెడ్డి మొదటి నుంచీ బీజేపీతో టచ్‌లో ఉన్నారని, మధ్యలో వారధిలా చంద్రబాబు పనిచేస్తున్నారని, ఆయన కనుసన్నల్లోనే రేవంత్‌ నడుస్తున్నారని అసలు కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఆయన ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేసినా అగ్రనేతలు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని చెప్తున్నారు. చివరికి ఏఐసీసీలోని ఆయన మార్గదర్శి ఈ వ్యవహారాన్ని సెటిల్‌ చేశారని చర్చ జరుగుతున్నది. అంతా సవ్యంగా నడుస్తుందని అనుకుంటుండగా ప్రధాని మోదీ ‘మేరే సే హీ జోడో’ అంటూ కొత్త పాచిక విసిరి, కాంగ్రెస్‌ను మళ్లీ కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.


Smacy News 51 minutes ago
Home Flash News