Select Location
All Locations
State
Region
City / District
డీపీఆర్ పరిశీలన తర్వాతే మెట్రో ఫేజ్- 2పై నిర్ణయం

డీపీఆర్ పరిశీలన తర్వాతే మెట్రో ఫేజ్- 2పై నిర్ణయం

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్), ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత, సమగ్ర పరిశీలన అనంతరం కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే, మూసీ నది పారిశుధ్యానికి సంబంధించి మొత్తం రూ.3, 975 కోట్ల వ్యయంతో 39 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను కేంద్రం మంజూరు చేసినట్టు వెల్లడించారు.

హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై బుధవారం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితో కలిసి నగరాభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుధ్యం, ప్రజారవాణా అంశాలపై సమీక్ష నిర్వహించినట్టు పేర్కొన్నారు. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా కేంద్రానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఖర్చుచేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కి.మీ మేర మెట్రో రెండోదశ విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించినట్టు పేర్కొంది. 

దానిని పరిశీలించి తదుపరి చర్యలను కేంద్రం చేపడుతుంది’ అని ఆయన వెల్లడించారు. మరోవైపు, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కిషన్ రెడ్డి మర్యాదపూర్తకంగా కలిశారు. అమృత్ 2.0 స్కీంలో మూసీనది మురుగు నీటి శుద్ధిఅమృత్ 2.0 స్కీంలో భాగంగా రూ.3,975 కోట్లతో మూసీనదిలో కలుస్తున్న మురుగు నీటిని శుద్ధి చేసేందుకు మొత్తం 39 సీవేజ్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాంట్లను (ఎస్టీపీలు) కేంద్రం మంజూరు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. ‘ఈ ఎస్టీపీలకు రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. దీని వల్ల శుద్ధి చేయని వ్యర్థపు నీరు నేరుగా మూసీనదిలో కలవకుండా నిరోధించడంతోపాటు.. మూసీనది పరిరక్షణ, నగర పారిశుధ్యం మెరుగుదలకు ఇది ఎంతో దోహదపడుతుంది. హైదరాబాద్ నగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హామీ ఇచ్చారు’ అని కిషన్​రెడ్డి స్పష్టం చేశారు.


V6 News 1 hour ago
Home Flash News