Select Location
All Locations
State
Region
City / District
YS Jagan | తక్కువ ఖర్చుతో అద్భుతంగా తెలంగాణ సచివాలయం.. చంద్రబాబుపై వైసీపీ చీఫ్‌ జగన్‌ సంచలన ఆరోపణలు

YS Jagan | తక్కువ ఖర్చుతో అద్భుతంగా తెలంగాణ సచివాలయం.. చంద్రబాబుపై వైసీపీ చీఫ్‌ జగన్‌ సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌, మే 21 (నమస్తే తెలంగాణ): కేసీఆర్‌ హయాంలో నిర్మించిన తెలంగాణ సెక్రటేరియట్‌ అద్భుతమని ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్‌ వైఎస్‌ జగన్‌ ప్రశంసించారు. తాడేపల్లిలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాడు కేసీఆర్‌ 28 ఎకరాల్లో దాదాపు పది లక్షల చదరపు అడుగుల్లో రూ.615 కోట్లతో సెక్రటేరియట్‌ కట్టారని గుర్తుచేశారు. ఏ విధంగా లెక్కేసినా చదరపు అడుగుకు రూ.6వేలు ఖర్చు చేశారని తెలిపారు.

అమరావతిలో మాత్రం చదరపు అడుగుకు రూ.20,427తో సచివాలయం నిర్మిస్తున్నారంటే కేసీఆర్‌ కూడా షాక్‌ అవుతారేమో అని జగన్‌ అన్నారు. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్‌ కల్చర్‌, ఎవరివి హత్యారాజకీయాలో చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. తమ కుటుంబంలో ముగ్గురు బలయ్యారని, హత్యా రాజకీయాలకు తాము బాధితులమని ఆవేదన వ్యక్తంచేశారు.

తమ తాత, తండ్రి, బాబాయి చనిపోయారని, చంద్రబాబు తమపైనే తప్పుడు రాజకీయాలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? అని జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రాజారెడ్డి హత్య జరిగిందని తెలిపారు. 1999 అసెంబ్లీ ఎన్నికల కంటే ఏడాది ముందు రాజారెడ్డిని చంపేశారని ఆరోపించారు. వైఎస్సార్‌ను కేవలం పులివెందులకు కట్టడి చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలన్నదే ఇందులో ఉన్న రాజకీయ కోణం అని పేర్కొన్నారు. రాజారెడ్డి కేసులో దోషులను హైదరాబాద్‌లోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాచి వారిని రక్షించింది ఎవరు? అని ప్రశ్నించారు. నాన్న వైఎస్సార్‌ విషయంలో కూడా ఇదే జరిగిందని, అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని చంద్రబాబు చెప్పిన నాలుగురోజులకే వైఎస్సాఆర్‌ ప్రమాదంలో చనిపోయారని వెల్లడించారు. గన్‌ కల్చర్‌ వారిదే..

తన చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేశానని టీవీ చానల్‌ లైవ్‌లో అంగీకరించిన దస్తగిరి ఇవాళ స్వేచ్ఛగా కార్లలో తిరుగుతున్నాడని వైఎస్‌ జగన్‌ తెలిపారు. చంద్రబాబు లాయర్‌ లూథ్రానే దస్తగిరి తరఫున వాదిస్తున్నారని వివరించారు. రాజకీయ లబ్ధి కోసం హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం వివేకానందరెడ్డి కేసులో జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ గన్‌ పట్టుకుని ఇద్దరిని కాల్చారని.. మరి గన్‌ కల్చర్‌ ఎవరిదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వంగవీటి మోహన రంగా, ఎన్టీఆర్‌ మీద దాడి చేసిన మల్లెల బాబ్జీ మరణాల వెనుక వేళ్ల్నీ చంద్రబాబు వైపే చూపించాయని జగన్‌ ఆరోపించారు. పింగళి దశరథ్‌ రామ్‌ అనే జర్నలిస్టును టీడీపీ అవినీతిపై ప్రశ్నిస్తే కత్తులతో దాడి చేసి చంపేశారని అన్నారు. చంద్రబాబుకు 77 ఏండ్లు వచ్చాయని, ఇంకా చిల్లర రాజకీయాలు చేయడానికి సిగ్గేయడం లేదా..? అని జగన్‌ నిలదీశారు.


Smacy News 53 minutes ago
Home Flash News