ప్రభుత్వానికి సొంత ఓటీటీ ఉండాలి: టికెట్ల రేట్లు కూడా పెంచాలంటూ CM విజయ్కు సేతుపతి రిక్వెస్ట్
ఒకప్పుడు కొత్త సినిమా విడుదలైతే ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. సెల్‌ఫోన్, టీవీల్లో ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావంతో లోకల్ నుంచి ఇంటర్నేషనల్ కంటెంట్ వరకు అన్నీ ఇంటి వద్దకే చేరుతున్నాయి. దీంతో వినోద ప్రపంచం పూర్తిగా డిజిటల్ వైపు మళ్లిపోయింది. ఈ క్రమంలోనే థియేటర్లో ఒకటో రెండో పెద్ద సినిమాలను తప్ప.. మిగతా సినిమాలు చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించారు. ఎలాగూ ఏ సినిమా ఐనా ఓటీటీలో రిలీజ్ అవుతుంది లే.. అప్పుడు చూద్దాంలే అన్నట్లు సగటు ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్లడం తగ్గించేశాడు. ఈ క్రమంలోనే సినీ నిర్మాతలు తమ మూవీలను ఓటీటీలకు అమ్ముకుంటున్నారు. సరే మారుతున్న కాలం కొద్దీ.. ఓటీటీలు వచ్చాయనుకుంటే.. చిన్న సినిమాల నిర్మాతలకు పెద్ద ప్లాట్ ఫామ్స్ నుంచి ఇబ్బంది ఏర్పడుతుంది. కేవలం స్టార్ హీరోల సినిమాలే కొంటున్నారు. తాజాగా ఈ విషయంపై హీరో విజయ్ సేతుపతి గళం విప్పారు.
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇటీవల ఒక ప్రైవేట్ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొని తమిళనాడు సీఎం విజయ్‌ను ఉద్దేశించి కీలక విజ్ఞప్తులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని ఆయన కోరారు. చిన్న, మధ్యతరహా సినిమాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను విజయ్ సేతుపతి ప్రస్తావించారు. కార్పొరేట్ ఓటీటీలకు చెక్ పెట్టాలంటే స్టేట్ ఓటీటీ కావాలని విజయ్ సేతుపతి కోరారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి కార్పొరేట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్.. మెయిన్గా స్టార్ హీరోల భారీ బడ్జెట్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే చిన్న సినిమాల నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విజయ్ సేతుపతి తెలిపారు. ఒకప్పుడు ఎంతో వేగంగా అభివృద్ధి చెందిన ఓటీటీ రంగం ప్రస్తుతం సంక్షోభంలో పడిందని, దీనివల్ల సినిమా పరిశ్రమలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. అలాగే సినిమా టికెట్ ధరల పెంపుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని సీఎం విజయ్‌ను కోరారు.
“చాలా సంవత్సరాల క్రితమే థియేటర్ టికెట్ ధరలు పెంచారు. ప్రస్తుతం ఇతర వస్తువుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో సినిమా టికెట్ ధరలను కూడా పెంచే అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుంది” అని విజయ్ సేతుపతి అన్నారు. ఎన్నో ఏళ్లుగా టికెట్ ధరల్లో పెద్ద మార్పులు జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే తరహా సూచనను గతంలో కమల్ హాసన్ కూడా చేసిన విషయాన్ని విజయ్ సేతుపతి గుర్తుచేశారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేసిన విజ్ఞప్తులపై సీఎం విజయ్ చర్చిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే తమిళ సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై విజయ్ మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు, కేరళ ప్రభుత్వ C-Space మోడల్ తరహాలో స్టేట్ ఓటీటీ వచ్చిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా, తమిళ ఇండస్ట్రీలో కూడా వస్తే.. కార్పొరేట్ ఓటీటీల ఆధిపత్యానికి అడ్డుకట్ట పడుతుందని, స్టార్ హీరోల సినిమాలే కాదు మంచి కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు గుర్తింపు, ఆదాయం లభిస్తాయని తమిళ నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ సేతుపతి – సీఎం దళపతి విజయ్ మధ్య మంచి అనుబంధం ఉంది. వ్యక్తిత్వ పరంగా కూడా వీరిద్దరూ ఎంతో ఎంతో కూల్. సౌమ్యంగా మాట్లాడే నైజాం వీరిది. అందుకే వీరిద్దరికి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. సినిమాల్లో మాత్రమే కాకుండా బయట కూడా వీరిద్దరూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో మాస్టర్ మూవీ చేసి ఫ్యాన్స్కు మంచి ట్రీట్ ఇచ్చారు.