ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సిందే.. అప్పటి వరకు ‘పేపర్ లీక్’పై పోరాడుతం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించబోదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్‌లు జరగకుండా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు హైదరాబాద్‌లో విద్యార్థులు చేపట్టిన భారీ నిరసన ప్రదర్శనకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ ఆదివారం తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ నిరసనల్లో విద్యార్థులు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ, ధర్మేంద్ర ప్రధాన్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘లక్షలాది మంది యువత రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. అయినా ప్రధాని మౌనంగా ఉండిపోయారు. దీన్నిబట్టి బాధ్యతాయుతంగా జవాబు చెప్పలేక కేంద్ర ప్రభుత్వం సమస్యల నుంచి తప్పించుకుంటోందని అర్థమవుతోంది’’ అని రాహుల్ మండిపడ్డారు.