పాపం సాయి సుదర్శన్.. ఐపీఎల్ చరిత్రలో వింత ఔట్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్ పోరులో గుజరాత్ టైటాన్స్‌కు ఏదీ కలిసి రాలేదు. ఆర్సీబీ విధించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైంది. అయితే గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఔటైన తీరు నిజంగా బాధాకరమని చెప్పొచ్చు. ఈ సీజన్ లో అత్యంత నిలకడగా పరుగులు చేస్తున్న సాయి సుదర్శన్.. ఆర్సీబీతో క్వాలిఫయర్-1 పోరులోనే వరుస బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించాడు.
ఈ క్రమంలోనే ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫీ వేసిన మూడో ఓవర్లో అద్భుతమైన స్క్వేర్ కట్‌తో బౌండరీ బాదాడు. వరుసగా రెండో ఫోర్ వచ్చిందని అభిమానులు అనుకుంటున్న తరుణంలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. షాట్ ఆడిన తర్వాత సాయి చేతిలో నుంచి బ్యాట్ జారిపోయింది. గాల్లో తిరుగిన బ్యాట్ వచ్చి నేరుగా లెగ్ స్టంప్‌ను తాకి బెయిల్స్‌ను పడగొట్టింది. ఆర్సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ సాయి సుదర్శన్‌ను హిట్ వికెట్‌గా ఔటిచ్చాడు. దీంతో చేసేదేం లేక సాయి సుదర్శన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇలాంటి విచిత్రమైన ఔట్ చూసి కామెంటేటర్లతో పాటు అభిమానులు కూడా షాక్ తిన్నారు. మ్యాచ్‌లో కూడా ఇదే టర్నింగ్ పాయింట్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ సీజన్‌లో గుజరాత్ తరఫున నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్ ఆరెంజ్‌క్యాప్ రేసులో దూసుకెళ్తున్నాడు.