కాక్రోచ్ స్ఫూర్తితో మరో కొత్త పార్టీ!
క్విక్ కాల్?” అనే మెసేజ్ చూడగానే క్యాలెండర్‌లో ఫ్రీ స్లాట్ వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఒక్క స్లైడ్‌లో చెప్పాల్సిన విషయం 10 స్లైడ్స్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌గా సా..గిపోతూ చివరికి మీటింగ్ టైమ్ కూడా మించి పోవడం. మనమంతా ఒక కుటుంబం (We are a family) అనే హెచ్‌ఆర్ మాట… పనిభారం పెరిగిన ప్రతిసారి గుర్తొచ్చే ఒకరకమైన ఫీలింగ్. కార్పొరేట్ ఉద్యోగుల్లో కలిగే ఈ అనుభవాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యంగ్య రూపంలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
రోజువారీ పనిలో భాగంగా మారిపోయిన ఈ చిన్న చిన్న ఒత్తిడులు, మీటింగ్ కల్చర్, ప్రెజెంటేషన్ల పొడవు, పని–వ్యక్తిగత జీవితం మధ్య సరిహద్దులు మసకబారడం వంటి అంశాలు.. ఇప్పుడు హాస్యరూపంలో ఒక పెద్ద ఆన్‌లైన్ సంభాషణగా మారాయి. సాధారణంగా ఉద్యోగులు లోపలే పేరుకుపోయే అసహనం.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక సార్వత్రిక అనుభవంగా మారి అందరినీ కనెక్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ అనే మీమ్ ట్రెండ్ నుంచి ప్రేరణ పొందుతూ “కార్పొరేట్ మజ్‌దూర్ జనతా పార్టీ (CMJP)” అనే సెటైరిక్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కార్పొరేట్ జీవితంలోని ఒత్తిడిని, అలసటను వ్యంగ్యంగా రాజకీయ రూపంలో చూపిస్తూ ఈ ట్రెండ్ మరింత చర్చకు దారి తీస్తోంది. గుర్గావ్‌కు చెందిన అమెజాన్ మాజీ ఉద్యోగి శుభం కుమార్ మిట్టల్ ‘లింక్డిన్’లో చేసిన ఒక సెటైరికల్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈయనే ఈ సీఎంజేపీ ప్రకటిస్తూ ఒక వ్యంగ్య మేనిఫెస్టోను పంచుకున్నారు. ఈ పోస్ట్ ఉద్యోగుల్లోని అలసట, పని ఒత్తిడి, కార్పొరేట్ సంస్కృతి మీద ఉన్న అసంతృప్తిని సరదాగా రాజకీయ రూపంలో చూపించింది. కాక్రోచ్ పార్టీ మీమ్ ట్రెండ్ నుంచి స్ఫూర్తి తీసుకున్న ఈ కాన్సెప్ట్, కార్పొరేట్ ఉద్యోగుల దైనందిన సమస్యలను ఫన్నీ మేనిఫెస్టోలా చూపించారాయన. ఈ వ్యంగ్య మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి పలు సరదా ప్రతిపాదనలు ఉన్నాయి.
వారానికి ఐదు రోజుల పని విధానాన్ని “అనవసరంగా ఎక్కువ పని దినాలు”గా పేర్కొనడం, “క్విక్ కాల్?” అనే మాటను అధికారికంగా వర్క్‌ప్లేస్ ఒత్తిడిగా గుర్తించాలన్న సూచన, అలాగే జీతంలో కంపెనీ చూపే మొత్తం (CTC).. చేతికి వచ్చే జీతం మధ్య తేడాలపై ప్రత్యేక దర్యాప్తు జరగాలన్న డిమాండ్‌లు ఉన్నాయి. ఇంకా వెటకారంగా.. వరుసగా మూడు సార్లు ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రత్యేకంగా “ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్” ఇవ్వాలని కూడా ఈ వ్యంగ్య మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే 50 స్లైడ్స్ కంటే ఎక్కువ ఉన్న పీపీటీలను ఉద్యోగుల మానసిక ఒత్తిడికి కారణమని గుర్తించాలని సూచించారు. “We are a family” అనే హెచ్‌ఆర్ మాటను.. ఉద్యోగులను ఒప్పించడానికి వాళ్లు ఉపయోగించే భావోద్వేగ పద్ధతిగా చూడాలని కూడా ఇందులో ఆయన ప్రస్తావించారు.