Sai Sudharsan | మళ్లీ హిట్ వికెట్‌గా సాయి సుదర్శన్ ఔట్.. ఐపీఎల్ చరిత్రలో అరుదైన అప్రతిష్ట, వీడియో వైరల్!
Sai Sudharsan | ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో సాయి సుదర్శన్‌ని దురదృష్టం వెంటాడుతోంది. ఇప్పటికే క్వాలిఫయర్-1లో హిట్ వికెట్‌గా ఔటైన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్.. తాజాగా క్వాలిఫయర్-2లోనూ అదే తరహాలో పెవిలియన్ చేరాడు. వరుసగా రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో హిట్ వికెట్‌గా ఔటవడంతో సాయి సుదర్శన్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ బౌలర్ బ్రిజేష్ శర్మ వేసిన 13వ ఓవర్‌లో సాయి సుదర్శన్ దురదృష్టవశాత్తు హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు.
ఆ ఓవర్‌లో ఐదో బంతిని బ్రిజేష్ శర్మ ఫుల్‌టాస్‌గా వేయగా, సాయి సుదర్శన్ ఆఫ్‌సైడ్ వైపు భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి బౌండరీ దిశగా వెళ్లినప్పటికీ, షాట్ ఆడే క్రమంలో అతని చేతిలోని బ్యాట్ జారి నేరుగా వికెట్లపై పడింది. దీంతో బేల్స్ కిందపడటంతో అంపైర్లు అతడిని హిట్ వికెట్‌గా ప్రకటించారు. ఈ ఔట్‌పై కామెంటరీ బాక్స్‌లో ఉన్న మాజీ భారత కోచ్ రవిశాస్త్రి సరదాగా స్పందించారు. “ఫెవికాల్ ఎక్కడ? బంక జిగురు ఎక్కడ?” అంటూ చమత్కరించడంతో ప్రేక్షకులు నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కూడా సాయి సుదర్శన్ హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. దీంతో వరుసగా రెండు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో హిట్ వికెట్‌గా ఔటైన తొలి బ్యాటర్‌గా అతడు అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.
అయితే ఈ దురదృష్టకర ఔట్‌కు ముందు సాయి సుదర్శన్ మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనింగ్ భాగస్వామిగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్తో కలిసి తొలి వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో సాయి హాఫ్ సెంచరీ పూర్తి చేయగా, గిల్ అద్భుత శతకంతో జట్టుకు బలమైన పునాది వేశాడు.మరోవైపు ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 96 పరుగులతో చెలరేగగా, రవీంద్ర జడేజా 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ ఛేదనలో సాయి సుదర్శన్ హిట్ వికెట్ ఘటన మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, “అయ్యో సాయి.. మళ్లీ అదే దురదృష్టం”, “ఇంత మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌కు ఇలా జరగడం బాధాకరం” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.